Nagababu: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన నాగబాబు

Nagababu Thanks CM Revanth Reddy and Minister Komatireddy
  • 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి రెండు గద్దర్ ఫిల్మ్ అవార్డులు
  • నిర్మాత నిహారిక, దర్శకుడు యదు వంశీకి నాగబాబు అభినందనలు
  • గద్దర్ పేరిట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంస
నిర్మాతగా తన కుమార్తె నిహారిక కొణిదెల తొలి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కడంపై నటుడు, నిర్మాత నాగబాబు ఆనందం వ్యక్తం చేశారు. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు పురస్కారాలు దక్కడం పట్ల ఆయన హర్షం ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.

ప్రజాకవి గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులు ఏర్పాటు చేసి, ఆయన గౌరవాన్ని మరింత పెంచిందని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై ఉత్తమ చిత్రంగా అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, ఈ చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు రావడం అతని ప్రతిభకు దక్కిన ప్రోత్సాహమని అభిప్రాయపడ్డారు.

తాను తొలిసారిగా నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రానికి జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు లభించిందని, ఇప్పుడు అదే తరహాలో తన కుమార్తె నిర్మించిన తొలి చిత్రానికీ అలాంటి గౌరవం దక్కడం యాదృచ్ఛికమని, సంతోషకరమైన సంఘటన అని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, దర్శకుడు యదు వంశీతో పాటు చిత్ర యూనిట్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.
Nagababu
Niharika Konidela
Committee Kurrollu
Gaddar Awards
Telangana Government
Revanth Reddy
Komatireddy Venkat Reddy
Yadu Vamsi
Telugu Cinema
Film Awards

More Telugu News