GT vs MI: గుజ‌రాత్ ఓట‌మి.. వెక్కివెక్కి ఏడ్చిన కోచ్‌ ఆశిశ్ నెహ్రా కుమారుడు.. ఇదిగో వీడియో!

Gujarat Titans Loss Ashish Nehra Son Emotional Video
  • ముల్లాన్‌పూర్ వేదిక‌గా ఎలిమినేటర్ మ్యాచ్‌
  • జీటీని 20 ర‌న్స్ తేడాతో ఓడించిన ఎంఐ
  • ఈ ప‌రాజయంతో టైటాన్స్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ 
  • మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌ జీటీ ఆటగాళ్ల కుటుంబ సభ్యుల‌ భావోద్వేగం
  • కన్నీళ్లు పెట్టుకున్న గిల్ సోదరి.. ఏడ్చేసిన నెహ్రా కుమారుడు
శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ) చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటాన్స్ (జీటీ) టోర్నీ నుంచి నిష్క్రమించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 208 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. సాయి సుదర్శన్ 80 ప‌రుగుల‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా గుజరాత్ విజయం సాధించలేకపోయింది. ఈ విజ‌యంతో ముంబ‌యి క్వాలిఫ‌య‌ర్‌-2కి అర్హ‌త సాధించింది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో ఎంఐ త‌ల‌ప‌డ‌నుంది.  

ఇక‌, ఈ ప‌రాజయం టైటాన్స్ ఫ్యాన్స్ ను హార్ట్ బ్రేక్ చేసింది. ఈ క్ర‌మంలోనే నిన్న మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌ జీటీ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, సిబ్బంది భావోద్వేగాలకు గుర‌య్యారు. ప్రధాన కోచ్ ఆశిశ్‌ నెహ్రా కుమారుడు స్టాండ్స్‌లో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించాడు. అలాగే జీటీ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ సోదరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. స్టాండ్స్‌లో ఆమె పక్కన కూర్చున్న మ‌రో యువ‌తి చూసి ఆమెను ఓదార్చింది.

అయితే, ఈ కీల‌క మ్యాచ్‌లో గుజ‌రాత్ ఫీల్డింగ్ ప‌రంగా చేసిన త‌ప్పిదాలు ముంబ‌యికి బాగా క‌లిసొచ్చాయి. కీల‌క స‌మయాల్లో ఫీల్డ‌ర్లు క్యాచ్‌ల‌ను నేల‌పాలు చేయ‌డం ఆ జ‌ట్టును దెబ్బ‌తీసింది. అలా లైఫ్ దొర‌క‌డంతోనే రోహిత్ శ‌ర్మ (81), సూర్య‌కుమార్ యాద‌వ్ (33) భారీ ఇన్నింగ్స్ ఆడారు. దాంతో ఎంఐ ఏకంగా 228 ప‌రుగుల‌ భారీ స్కోర్ చేసింది. 

మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ సార‌థి గిల్ మాట్లాడుతూ... "ఇది అద్భుతమైన మ్యాచ్‌. మేము సరిగ్గా ఆడ‌లేక‌పోయాం. చివరి మూడు-నాలుగు ఓవర్లు మా ప్ర‌ణాళిక ప్ర‌కారం సాగ‌లేదు. మా బౌల‌ర్లు ముంబ‌యి బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ కీల‌కమైన గేమ్‌లో ముగ్గురు స్టార్ ప్లేయ‌ర్లు దూరం కావ‌డం మ‌మ్మ‌ల్ని దెబ్బ‌తీసింది. 

అటు ఫీల్డింగ్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం నిరాశ‌ప‌రిచింంది. ఏకంగా మూడు క్యాచ్‌లు మిస్ చేయ‌డం కూడా ముంబ‌యి భారీ స్కోర్‌కి కార‌ణ‌మైంది. ఈ పిచ్‌పై 210 ర‌న్స్ ఛేదించ‌డం సుల‌భంగా ఉండేది. చివరి ఓవర్‌లో కూడా మేము ధార‌ళంగా ప‌రుగులు ఇవ్వ‌డం దెబ్బ‌తీసింది" అని గిల్ చెప్పాడు.  
GT vs MI
Ashish Nehra
Gujarat Titans
IPL 2025
Mumbai Indians
Shubman Gill
Sai Sudharsan
Cricket
Eliminator Match
Indian Premier League
Cricket News

More Telugu News