Kamal Haasan: ‘థగ్ లైఫ్’ రిలీజ్‌పై నీలినీడలు.. కమల్ క్షమాపణ చెప్పకుంటే బ్యాన్ తప్పనట్టే!

Kamal Haasan Thug Life Release in Doubt After Ban Threat
  • కన్నడ భాషపై కమల హాసన్ వ్యాఖ్యలతో వివాదం తీవ్రతరం
  •  క్షమాపణ చెప్పకుంటే 'థగ్ లైఫ్' బ్యాన్ చేస్తామన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్
  • కమల్ అన్ని సినిమాలనూ నిషేధిస్తామన్న కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి
  • క్షమాపణ చెప్పేది లేదన్న కమల్ హాసన్
  • గతంలోనూ బెదిరింపులు చూశానన్న నటుడు
కన్నడ భాషపై కమల హాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలన్నింటినీ రాష్ట్రంలో నిషేధిస్తామని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి తాజాగా హెచ్చరించారు. "నేను ఇప్పటికే ఒక లేఖ రాశాను. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మంచి నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో కమల హాసన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాను నిషేధిస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.  

క్షమాపణకు కమల్ నిరాకరణ
ఈ వివాదంపై కమల హాసన్ వెనక్కి తగ్గడం లేదు. క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తనకు ఇటువంటి బెదిరింపులు కొత్తేమీ కాదన్నారు. 2013లో ఆయన నటించిన "విశ్వరూపం" సినిమా విడుదల సమయంలో తమిళనాడులో 15 రోజుల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

బాక్సాఫీసు వసూళ్లపై ప్రభావం!
ఈ వివాదం ‘థగ్ లైఫ్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శింబు ఎస్టీఆర్, త్రిష కృష్ణన్, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ‘థగ్ లైఫ్’ సినిమాను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.
Kamal Haasan
Thug Life
Karnataka Film Chamber of Commerce
KFCC
Shivraj Tangadagi
Kannada language
Maniratnam
Simbu STR
Trisha Krishnan

More Telugu News