Dubai: కేర‌ళ క‌మ్యూనిటీ ఈవెంట్‌కు గెస్టులుగా పాక్ మాజీ క్రికెట‌ర్లు.. నెటిజ‌న్ల ఆగ్ర‌హం!

Shahid Afridi Pakistan Cricketers Invited to Kerala Event Spark Outrage
  • దుబాయిలో కేర‌ళ క‌మ్యూనిటీ ఈవెంట్‌
  • ఈ ఈవెంట్‌కు పాక్‌ మాజీ క్రికెట‌ర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమ‌ర్ గుల్‌కు ఆహ్వానం
  • ఇటీవ‌ల ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, పాక్‌తో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో నెటిజ‌న్ల ఫైర్‌
  • ఇది ఎంత సిగ్గుచేటు అంటూ నెటిజ‌న్ల సోష‌ల్ మీడియా పోస్టులు
జ‌మ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జ‌రిగిన పాశ‌విక ఉగ్ర‌దాడిలో ముష్క‌రులు అమాయ‌కులైన‌ 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్ ప్రతీకారంగా పాకిస్థాన్‌, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీఓకే)ల‌లో ఆప‌రేష‌న్ సిందూర్ పేరిట‌ క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. ఇది త‌ట్టుకోలేని పాక్.. భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని డ్రోన్‌, మిస్సైల్స్ దాడుల‌కు పాల్ప‌డింది. ఈనేప‌థ్యంలో భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  

అయితే, దుబాయిలో కేర‌ళ క‌మ్యూనిటీ నిర్వ‌హించిన ఓ ఈవెంట్‌కు పాకిస్థానీ మాజీ క్రికెట‌ర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమ‌ర్ గుల్‌ను ఆహ్వానించ‌డం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, పాక్ యుద్ధం విష‌యాల‌ను మ‌రిచి ఆ దేశ క్రికెట‌ర్ల‌ను పిల‌వ‌డ‌మేంట‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆఫ్రిది చాలాసార్లు ఇండియాకు వ్య‌తిరేకంగా మాట్లాడిన విష‌యం గుర్తులేదా అని మండిప‌డుతున్నారు. 

ప‌హ‌ల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా ఆఫ్రిది భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశార‌ని, భార‌త్‌పై విజ‌యం సాధించామంటూ అక్క‌డి ప్ర‌జ‌లు తీసిన ర్యాలీలోనూ అత‌డు పాల్గొన్నాడ‌ని గుర్తు చేసి ఫైర్ అవుతున్నారు. అలాంటి వ్య‌క్తికి కేరళ క‌మ్యూనిటీ నుంచి ఘన స్వాగతం లభించడాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. 

"ఇది ఎంత సిగ్గుచేటు.. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారతదేశంపై అతని విషపూరిత వైఖరి తర్వాత దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళీయులు ఈ భారత వ్యతిరేక పాకిస్థానీని 'బూమ్ బూమ్' అంటూ  స్వాగతించారు" అని ఓ యూజ‌ర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈవెంట్ తాలూకు వీడియో పోస్ట్ చేశారు.

గతంలో ఓ టాక్ షోలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ... "మీరు కశ్మీర్‌లో 8 లక్షల మంది సైన్యాన్ని మోహరించారు. అయినప్పటికీ అక్కడ అలాంటి సంఘటన జరిగింది. దీని అర్థం మీరు మీ ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు, మీ ఆర్మీ అసమర్థులు" అని అన్నారు. ఆఫ్రిది మాట్లాడిన ఆ వీడియోను మ‌రో యూజ‌ర్ షేర్ చేస్తూ... "కానీ, ఇప్పుడు అలాంటి వ్య‌క్తికి మ‌నోళ్లు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం.. ఇది చూడటానికి సిగ్గుగా ఉంది" అని రాసుకొచ్చారు. 
Dubai
Shahid Afridi
Kerala Community Event
Pakistan Cricketers
Umar Gul
Pahalgam Terrorist Attack
India Pakistan Conflict
Anti India Remarks
Kashmir Issue
Cricket Controversy
Dubai Event

More Telugu News