Tirumala: తప్పు చేశాను... నన్ను క్షమించండి: తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తుడి క్షమాపణ

Tirumala Temple Pilgrim Expresses Regret for Slogans Against TTD
  • నిన్న అర్ధరాత్రి తిరుమల క్యూ లైన్లో భక్తుల ఆందోళన
  • జ్వరంతో ఉండటం వల్ల ఫ్రస్టేషన్ కు గురయ్యానన్న భక్తుడు
  • టీటీడీ ఛైర్మన్ కు క్షమాపణ చెబుతున్నానన్న భక్తుడు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి క్యూలైన్లలో ఉన్న భక్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు డౌన్ డౌన్, టీటీడీ ఈవో శ్యామలరావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసి పిల్లలు, మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది.

అయితే క్యూలైన్లో టీటీడీ ఛైర్మన్, ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పక్కనున్న భక్తుల చేత నినాదాలు చేయించిన సదరు భక్తుడు తన వైఖరి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఓ మీడియా ఛానల్ తో ఆయన మాట్లాడుతూ... తనకు జ్వరంగా ఉందని, క్యూలైన్లో భక్తులకు అందించిన సాంబార్ రైస్ తినలేకపోయానని... పాలు ఇవ్వాలని అడిగానని చెప్పాడు. అప్పటికే చాలా గంటల సేపు క్యూ లైన్లో ఉండటం, జ్వరంగా ఉండటం వల్ల ఫ్రస్టేషన్ కు గురయ్యాననని తెలిపారు. ఆ తర్వాత టీటీడీ సిబ్బంది తమకు పాలు కూడా అందించారని చెప్పారు. ఈ రోజు లక్షకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని తెలిసిందని... పవిత్రమైన ఆలయంలో తాను అలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. టీడీడీ ఛైర్మన్ గారికి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. గతంలో తాను ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని... ఫ్రస్టేషన్ లోనే అలా చేశానని అన్నారు.
Tirumala
TTD Chairman
BR Naidu
TTD EO
Shyamala Rao
Tirumala Temple
Tirupati
Andhra Pradesh
Queue Lines
Pilgrims

More Telugu News