Kotha Prabhakar Reddy: ప్రభుత్వాన్ని రేవంత్ నడిపిస్తున్నారా? లేదా మంత్రులు నడిపిస్తున్నారా?: కొత్త ప్రభాకర్ రెడ్డి

Kotha Prabhakar Reddy Criticizes Revanth Reddys Government
  • తెలంగాణలో కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మడం లేదన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ
  • రాజీవ్ యువ వికాస్ పథకం యువతను మోసగించే డ్రామా అని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విశ్వాసం కొరవడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యువతకు దగ్గరయ్యేందుకు ‘రాజీవ్ యువ వికాస్’ పేరుతో ఒక నాటకానికి తెరలేపారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకం వాయిదా పడటమే ప్రభుత్వ అసమర్థ పనితీరుకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. అసలు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నారా లేక మంత్రులు, ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారా అనేది అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో రిజిస్ట్రేషన్ల కోసం యువత నుంచి రూ.2,000 వసూలు చేసి వారిని నష్టపరుస్తున్నారని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కొత్త ప్రభాకర్‌‌రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, ఇందిరమ్మ ఇళ్లు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండటంతో లబ్ధిదారులు వాటిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వివిధ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులతో రాజకీయంగా పోరాడాలని, అంతేకానీ అమాయక ప్రజలను మోసగించవద్దని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలన చేయడం తెలియకపోతే, తాము దిశానిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అది కూడా సాధ్యం కాకపోతే, ముఖ్యమంత్రిని మార్చాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, వారి విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 
Kotha Prabhakar Reddy
Revanth Reddy
Telangana
BRS
Congress Party
Rajiv Yuva Vikas
Indiramma Houses
Telangana Politics
Government Schemes
Political Criticism

More Telugu News