Rajendra Prasad: తన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడం పట్ల రాజేంద్రప్రసాద్ వివరణ

Rajendra Prasad Clarifies Recent Controversial Comments
  • తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న రాజేంద్రప్రసాద్
  • అది వారి సంస్కారం, వారి ఖర్మ అంటూ వ్యాఖ్యలు
  • తానెప్పుడూ సరదాగానే ఉంటానని స్పష్టం చేసిన నటకిరీటి
  • 'షష్టిపూర్తి' సినిమా విజయోత్సవ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కమెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కొన్ని రోజుల కిందట కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి చర్చనీయాంశంగా మారారు. తన వ్యాఖ్యలను తప్పుబడుతుండడం పట్ల రాజేంద్రప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చారు. ఇవాళ 'షష్టిపూర్తి' చిత్ర యూనిట్ విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్, తాను ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని స్పష్టం చేశారు.

సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజైన జూన్ 2న ఈ సక్సెస్ మీట్ జరగడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు. "ఆయనకు నేనంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. మీడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను మీరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం" అని ఆయన తెలిపారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో తాను పరిచయం చేసిన హీరోయిన్, నటుడి గురించి సరదాగా మాట్లాడిన మాటలను కూడా తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. పెళ్లి (పెళ్లిపుస్తకం) నుంచి షష్టిపూర్తి వరకూ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగడం ఇండస్ట్రీలో ఏ నటుడికి దక్కని అరుదైన అవకాశం. మీ అందరూ ఈ సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు" అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. నటన గురించి మాట్లాడుతూ, "మనం నటించే సినిమాల్లో మనం కనిపించకూడదు, పాత్రలే కనిపించాలి. నాతో పనిచేసిన నటీనటులంతా నాతో సరదాగానే ఉంటారు. అందులో తప్పేం లేదు" అని ఆయన వివరించారు.


Rajendra Prasad
Rajendra Prasad comments
Rajendra Prasad controversy
Shashtipoorthi movie
Ali comedian
Telugu cinema
Ilaiyaraaja
Tollywood news
Telugu film industry
Rajendra Prasad interview

More Telugu News