Sajjala Ramakrishna Reddy: బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపుతున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams AP Government Over Arrests
  • జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించిన సజ్జల
  • నందిగం సురేశ్ పై 12 కేసులు పెట్టారని మండిపాటు
  • రెడ్ బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రెడ్ బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. చట్టాల ప్రకారం పని చేయాల్సిన పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శంచారు. 

గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్, పార్టీ నేత తురకా కిశోర్ లను సజ్జల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, అరెస్ట్ చేయించడం వంటి పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేసి, జైలుకు పంపించారని అన్నారు. ఆ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. సామాన్యులు, జర్నలిస్టులపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.

నందిగం సురేశ్ పై  12 కేసులు పెట్టారని... ఒకదాని తర్వాత మరో కేసు నమోదు చేయడం... బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ మళ్లీ జైలుకు పంపడం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఆయన బెయిల్ పై బయటకు రాగానే మరో పీటీ వారెంట్ తో రెడీగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh Politics
Nandigam Suresh
Turaka Kishore
Guntur Jail
Red Book
Illegal Arrests
TDP Government
Political Vendetta

More Telugu News