Vajahat Khan: శర్మిష్ఠ కేసులో బిగ్ ట్విస్ట్: కంప్లైంట్ ఇచ్చిన వజాహత్ ఖాన్ మిస్సింగ్

Vajahat Khan complainant in Sharmistha Panoly case missing
  • ఆదివారం రాత్రి నుంచి కనిపించడం లేదన్న తండ్రి సాదత్ ఖాన్
  • పనోలి అరెస్ట్ తర్వాత తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపణ
  • వజాహత్ ఖాన్‌పై హిందువులను కించపరిచాడని మరో ఫిర్యాదు నమోదు
  • వజాహత్ కోసం రంగంలోకి అస్సాం పోలీసులు 
  • పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేక బృందం
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి అరెస్ట్‌కు కారణమైన ఫిర్యాదుదారు వజాహత్ ఖాన్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. గత ఆదివారం రాత్రి నుంచి వజాహత్ ఖాన్ కనిపించడం లేదని, పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి తమ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతని తండ్రి ఆరోపించారు. ఈ పరిణామం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.

శర్మిష్ఠ పనోలిని కోల్‌కతా పోలీసులు గురుగ్రామ్‌లో అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ముస్లిం బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ, మతపరమైన వ్యాఖ్యలు, దూషణలతో కూడిన ఒక వీడియో పోస్ట్ చేసినందుకు గాను ఆమె అరెస్టయ్యారు. వజాహత్ ఖాన్ ఫిర్యాదుతోనే పోలీసులు శర్మష్ఠను అరెస్ట్ చేశారు.

వజాహత్ ఖాన్ తండ్రి సాదత్ ఖాన్ ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ "పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి మాకు బెదిరింపులు వస్తున్నాయి. నా కుమారుడు అమాయకుడు, లౌకికవాది. అతను హిందూ మతాన్ని అవమానించలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి సోషల్ మీడియా ప్రొఫైల్ హ్యాక్ అయి ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పనోలి జీవితాన్ని నాశనం చేశావంటూ వజాహత్‌కు కొన్ని రోజులుగా దూషణలు, బెదిరింపులతో కూడిన కాల్స్ వెల్లువెత్తాయని, దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని సాదత్ ఖాన్ తెలిపారు. తనకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని, దుర్భాషలాడారని ఆయన పేర్కొన్నారు.

వజాహత్‌పై మరో ఫిర్యాదు
ఈ పరిణామాలు ఇలా ఉండగానే వజాహత్ ఖాన్‌పై కోల్‌కతా పోలీసులకు అధికారికంగా మరో ఫిర్యాదు అందింది. శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ అనే సంస్థ ఈ ఫిర్యాదు చేసింది. వజాహత్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై హిందూ సమాజానికి వ్యతిరేకంగా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆ సంస్థ ఆరోపించింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

హిందువులను ‘రేపిస్ట్ కల్చర్స్’ (అత్యాచార సంస్కృతులు), ‘యూరిన్ డ్రింకర్స్’ (మూత్రం తాగేవారు) వంటి పదజాలంతో కించపరిచాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, లైంగిక అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని, హిందూ మత సంప్రదాయాలు, దేవాలయాలు, పండుగలను అపహాస్యం చేశాడని ఆరోపించారు. మత ఘర్షణలను ప్రేరేపించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను ఖాన్ వ్యాప్తి చేస్తున్నాడని పేర్కొన్నారు.  

అస్సాం పోలీసుల రంగ ప్రవేశం
వజాహత్ ఖాన్ చేసిన ఆరోపిత పోస్ట్‌పై అస్సాంలో కూడా ఒక కేసు నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ తమ రాష్ట్ర పోలీసు బృందం పశ్చిమ బెంగాల్‌ను సందర్శించి వజాహత్ ఖాన్‌ను న్యాయస్థానం ముందు హాజరుపరచడంలో సహాయం కోరుతుందని తెలిపారు.

పనోలి అరెస్ట్.. పోలీసుల స్పందన
శర్మిష్ఠ పనోలిని మే 30న శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అక్కడ ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మే 15న గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. వివాదానికి కారణమైన వీడియోను ఆమె తర్వాత డిలీట్ చేసి, బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. ఆమె అరెస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో కోల్‌కతా పోలీసులు స్పందించారు. "ద్వేషపూరిత ప్రసంగాలు, దూషణలను భావ ప్రకటనా స్వేచ్ఛగా తప్పుగా అర్థం చేసుకోకూడదు" అని తమ చర్యను సమర్థించుకున్నారు.
Vajahat Khan
Sharmistha Panoly
Kolkata Police
Assam Police
Social Media Influencer
Missing Person
Religious Comments
Hate Speech
Sriram Swabhiman Parishad
West Bengal

More Telugu News