AB Venkateswara Rao: అది రాయి దాడి కాదు... ఒక వడ్డెర కులస్తుడి జీవితాన్ని జగన్ నాశనం చేశారు: ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao Alleges Jagan Destroyed Vaddera Mans Life
  • శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ
  • రాయి దాడి కేసులో సతీశ్‌ను బలిపశువును చేశారని ఆరోపణ
  • గజమాల దెబ్బను రాయి దాడిగా చిత్రీకరించి లబ్ధి పొందారన్న ఏబీవీ
  • సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్
  • కేసు మూసివేసి, బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
  • బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్ అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్‌దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో 'రాయి దాడి' కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏబీవీ మాట్లాడుతూ, "గజమాల వేసినప్పుడు తగిలిన చిన్న గాయాన్ని ఉద్దేశపూర్వకంగా రాయి దాడిగా చిత్రీకరించి, సానుభూతి పొంది, రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. దీనికోసం ఏ పాపం తెలియని ఒక నిరుపేద వడ్డెర యువకుడిని, అతని కుటుంబాన్ని బలిపశువును చేశారు. ఇది రాయి దాడి కాదు, ఒక వడ్డెర బిడ్డ జీవితాన్ని జగన్ నాశనం చేసిన ఉదంతం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రభుత్వం మారినా, ఆ దుర్మార్గపు కేసును ఇప్పటికీ కొట్టివేయకుండా తిప్పుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారు. సతీశ్‌పై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ చిత్రహింసల గురించి వింటే గుండె తరుక్కుపోతుంది. ఆ యువకుడు ఇప్పటికీ తన చేత్తో అన్నం కూడా తినలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇంతటి ఘోరానికి పాల్పడిన పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని ద్వారా సమాజానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బాధితులు చేసిన తప్పేంటి? ఈ కేసుతో వారికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా, ఎలాంటి సాక్ష్యం లేకపోయినా ఎందుకు ఇంతలా వేధించాలి?" అని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

ఈ అమానుష ఘటనలో అమాయకులను బలిపశువులను చేసిన బాధ్యులైన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ కమిషనర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సతీశ్‌పై బనాయించిన అక్రమ కేసును వెంటనే మూసివేయాలని, బెయిల్ బాండ్స్‌ను రద్దు చేసి, వారు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా, ప్రభుత్వం బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి, వారి జీవితాలకు భరోసా కల్పించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలకు నిదర్శనమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
AB Venkateswara Rao
Jagan Mohan Reddy
Vijayawada stone pelting
Satish Vaddera
Andhra Pradesh politics
ABV allegations
political conspiracy
police investigation
false accusation
justice for Satish

More Telugu News