RCB: 17 సార్లు మిస్సయిన ట్రోఫీ 18వ సారి చిక్కింది... ఐపీఎల్-2025 ఛాంపియన్ ఆర్సీబీ

RCB Wins IPL 2025 Title Ending 17 Year Wait
  • ఆర్సీబీ విజేత: ఐపీఎల్ 2025 టైటిల్ కైవసం
  • 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
  • ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ గెలుపు
  • విరాట్ కోహ్లీ చిరకాల స్వప్నం సాకారం
  • అహ్మదాబాద్‌లో బెంగళూరు అభిమానుల సంబరాలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్)తో జరిగిన హోరాహోరీ పోరులో విజయం సాధించి, తమ 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఆర్సీబీ ఎట్టకేలకు తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో బెంగళూరు అభిమానుల దశాబ్దాల కల నెరవేరింది.

ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. 2008 నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ ప్రయత్నంలో సొంతం చేసుకుంది. ఈ చారిత్రక విజయంతో ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, కోట్లాది మంది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

లక్ష్యఛేదనలో తడబడ్డ పంజాబ్

191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తొలి 3.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు జోడించారు. అయితే, ఐదో ఓవర్‌లో జోష్ హేజిల్‌వుడ్ పంజాబ్‌ను దెబ్బతీశాడు. 24 పరుగులు చేసిన ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేయడంతో పంజాబ్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఆర్సీబీ బౌలర్లు క్రమంగా పట్టు బిగించారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో శశాంక్ సింగ్ (9 బంతుల్లో 10), నెహాల్ వధేరా (13 బంతుల్లో 14) ఉన్నారు. చివరి 30 బంతుల్లో పంజాబ్ విజయానికి 72 పరుగులు అవసరమవగా, అప్పటికే అవసరమైన రన్ రేట్ 14.40కి చేరింది.

ఈ దశలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. భారీ షాట్లు ఆడే క్రమంలో పంజాబ్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆర్సీబీ బౌలర్ల సమష్టి కృషితో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ సిక్సర్ల మోత మోగించినప్పటికీ, పంజాబ్ కింగ్స్ విజయానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.




కోహ్లీకి ఆనందం... శ్రేయాస్‌కు నిరాశ!
ఆర్సీబీ తరఫున ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఈ విజయం ఎంతో ప్రత్యేకం. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీకి, కోహ్లీ నాయకత్వ పటిమ, అద్భుత ఆటతీరు ఈసారి ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఇది మూడో ఐపీఎల్ ఫైనల్ అయినప్పటికీ, మరోసారి నిరాశే ఎదురైంది. రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం తీవ్రంగా పోరాడిన ఈ మ్యాచ్, చివరికి ఆర్సీబీకి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. ఈ విజయంతో ఆర్సీబీ క్యాంప్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.


కాగా, చివరి ఓవర్లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే, కోహ్లీ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా దక్కని విజయం, ఇన్నాళ్లకు దక్కిందన్న భావోద్వేగాలతో కోహ్లీ కంటతడి పెట్టాడు.

ఈ ఫైనల్ మ్యాచ్ కు బ్రిటన్ మాజీ ప్రధాని, బెంగళూరు అల్లుడు రిషి సునాక్ సతీసమేతంగా హాజరయ్యారు. స్టేడియంలో ఆయన ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ కనిపించారు. బెంగళూరు టీమ్ ను అడుగడుగునా ప్రోత్సహిస్తూ ఆయన మ్యాచ్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి క్రికెట్ అనుభూతిని ఎప్పుడూ పొందలేదని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.

RCB
Royal Challengers Bangalore
Virat Kohli
IPL 2025
Indian Premier League
Punjab Kings
Shreyas Iyer
Narendra Modi Stadium
Cricket
T20

More Telugu News