Krunal Pandya: ఐపీఎల్ చరిత్రలో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత

Krunal Pandya First Player to Win Two IPL Finals Player of the Match Awards
  • రెండు ఐపీఎల్ ఫైనల్స్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్న తొలి ఆటగాడు
  • ఆర్‌సీబీ తొలి టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన కృనాల్
  • 2017లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఫైనల్‌లో ఇదే అవార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. రెండు వేర్వేరు ఐపీఎల్ ఫైనల్స్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. నిన్న‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో కృనాల్ కీలక పాత్ర పోషించాడు.

ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో 34 ఏళ్ల కృనాల్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. త‌న‌ 4 ఓవర్ల కోటాలో కేవ‌లం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మొద‌ట‌ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఔట్ చేసిన కృనాల్, ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న‌ జోష్ ఇంగ్లిస్‌ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. ఈ రెండు వికెట్లు మ్యాచ్ గతిని మార్చడంలో దోహదపడ్డాయి.

కాగా, కృనాల్ పాండ్య ఐపీఎల్ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2017లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడుతూ ఫైనల్‌లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు ఆర్‌సీబీ త‌ర‌ఫున ఇదే అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇటా రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్ ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. తన సోద‌రుడు, ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యతో జరిగిన సంభాషణను పంచుకుంటూ... "11 ఏళ్లలో పాండ్యా కుటుంబానికి తొమ్మిది ట్రోఫీలు వస్తాయని హార్దిక్‌తో చెప్పాను. మేమిద్దరం చాలా కష్టపడ్డాం. ఇలాంటి కీలక మ్యాచ్‌లో జట్టు విజయంలో భాగమవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది" అని అన్నాడు.

ఇక‌, ఐపీఎల్ 2025 సీజన్‌లో కృనాల్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. మొత్తం 15 మ్యాచ్‌లలో 22.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి, ఈ టోర్నమెంట్‌లో 109 పరుగులు చేశాడు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై సాధించిన అజేయమైన 73 పరుగులు కూడా ఉన్నాయి. ఈ విజయంతో కృనాల్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో టైటిల్‌ను అందుకున్నాడు. గతంలో మూడుసార్లు ఎంఐతో, తాజాగా ఆర్‌సీబీతో ఒకసారి విజేతగా నిలిచాడు.

కృనాల్ ప్రదర్శనపై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించారు. "కృనాల్ పాండ్యా స్పెల్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక ఫింగర్ స్పిన్నర్‌గా, అతను బ్యాటర్లను ఆలోచనలో పడేశాడు" అని కోహ్లీ తెలిపాడు.

ఐపీఎల్ ఫైనల్‌లో పీఓటీఎం అవార్డు గెలుచుకున్న‌ ఆటగాళ్లు వీరే..
2008 – యూసుఫ్ పఠాన్ (ఆర్ఆర్‌)
2009 - అనిల్ కుంబ్లే (ఆర్‌సీబీ)
2010 – సురేష్ రైనా (సీఎస్‌కే)
2011 – మురళీ విజయ్ (సీఎస్‌కే)
2012- మన్వీందర్ బిస్లా (కేకేఆర్‌)
2013 – కీరాన్ పొలార్డ్ (ఎంఐ)
2014 – మనీష్ పాండే (కెకెఆర్)
2015 – రోహిత్ శర్మ (ఎంఐ)
2016 – బెన్ కటింగ్ (ఆర్‌సీబీ)
2017 – కృనాల్ పాండ్యా (ఎంఐ)
2018 – షేన్ వాట్సన్ (సీఎస్‌కే)
2019 – జస్‌ప్రీత్ బుమ్రా (ఎంఐ)
2020 – ట్రెంట్ బౌల్ట్ (ఎంఐ)
2021 – ఫాఫ్ డు ప్లెసిస్ (సీఎస్‌కే)
2022 – హార్దిక్ పాండ్య (జీటీ)
2023 – డెవాన్ కాన్వే (సీఎస్‌కే)
2024 – మిచెల్ స్టార్క్ (కేకేఆర్‌)
2025 – కృనాల్ పాండ్యా (ఆర్‌సీబీ)
Krunal Pandya
IPL 2025
Royal Challengers Bangalore
RCB
IPL Final
Player of the Match
Hardik Pandya
Mumbai Indians
Virat Kohli
Cricket

More Telugu News