Rajat Patidar: కోహ్లీ కంటే ఎక్కువగా ఈ కప్‌కు ఎవరూ అర్హులు కారు: రజత్ పటిదార్ భావోద్వేగం

Virat Kohli Deserves This Cup More Than Anyone Rajat Patidar
  • 18 ఏళ్ల‌ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు
  • ఆర్సీబీకి మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీ
  • ఈ చారిత్రక విజయాన్ని కోహ్లీకి అంకితం చేసిన కెప్టెన్ రజత్ 
  • కోహ్లీ నుంచి నేర్చుకోవ‌డానికి త‌న‌కు ద‌క్కిన గొప్ప అవ‌కామని వ్యాఖ్య‌
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సువర్ణాక్షరాలతో తమ పేరును లిఖించుకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలవడం ద్వారా తమ మొట్టమొదటి ట్రోఫీని కైవసం చేసుకుంది. యువ కెప్టెన్ రజత్ పటిదార్ నాయకత్వంలో సాధించిన ఈ చారిత్రక విజయం యావత్ ఆర్సీబీ అభిమానులను, ఆటగాళ్లను ఆనంద సాగరంలో ముంచెత్తింది. 

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ ప్రదర్శించిన పట్టుదల, నమ్మకం ప్రశంసనీయం. ఎన్నోసార్లు తృటిలో టైటిల్ చేజార్చుకుని నిరాశకు గురైన జట్టు, ఈసారి మాత్రం అంచనాలను అందుకుంది. జ‌ట్టు విజ‌యంపై కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ... ఈ గెలుపును ఆర్సీబీ దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. "అందరికంటే ఎక్కువగా అతడే ఈ విజయానికి అర్హుడు. ఎందుకంటే 18 సీజ‌న్లుగా ఒకే జ‌ట్టుకు ఆడుతున్నాడు" అని పేర్కొన్నాడు.

"ఈ విజయం నాకు, విరాట్ కోహ్లీకి, మా ఫ్రాంచైజీకి, మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకం. వారందరూ ఈ గెలుపుకు అర్హులు. కోహ్లీకి కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు గొప్ప అవకాశం. ఆయ‌న నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇదొక అద్భుతమైన అనుభవం" అని తెలిపాడు. 

ఇక‌, మ్యాచ్‌ సరళిని విశ్లేషిస్తూ, నెమ్మదిగా ఉన్న పిచ్‌పై 190 పరుగులు చేయడం తమ విజయానికి కీలకమని పటిదార్ చెప్పాడు. బౌలర్లు తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారని ప్రశంసించాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పాడ‌ని, అందుకే అతడికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కిందని వివరించాడు. 

కాగా, కోహ్లీకి ఈ విజయం వ్యక్తిగత మైలురాయే కాకుండా, ఇన్నేళ్లుగా జట్టు పట్ల ఆయన చూపిన విధేయత, అలుపెరగని స్ఫూర్తికి దక్కిన గౌరవంగా నిలిచింది. ఈ ఐపీఎల్ విజయం జట్టు కృషికి, పట్టుదలకు, క్రికెట్‌లోని భావోద్వేగాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ముఖ్యంగా రజత్ పటిదార్ తన జట్టు దిగ్గజ ఆటగాడికి ఈ విజయాన్ని అంకితమివ్వడం ఈ గెలుపునకు మరింత వన్నె తెచ్చింది.
Rajat Patidar
RCB
Royal Challengers Bangalore
Virat Kohli
IPL 2025
Krunal Pandya
IPL victory
Cricket
Indian Premier League
Rajat Patidar interview

More Telugu News