Rahul Gandhi: సైన్యాన్ని కించపరిచే హక్కు లేదు: రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం

Rahul Gandhi Criticized by Allahabad HC Over Army Remarks
  • సైన్యంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారణ
  • "ఆర్మీని కించపరచొద్దు" అంటూ రాహుల్‌కు హైకోర్టు హితవు
  • వాక్ స్వాతంత్ర్యానికి హద్దులున్నాయని వ్యాఖ్య
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైన్యంపై గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మన సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.

గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న వారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదు. ఇది నిజం కాదా? ఇదంతా యావత్ దేశం గమనిస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పుట్లో తీవ్ర దుమారం రేపడంతో పాటు విమర్శలకు దారితీశాయి.

రాహుల్ వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయంటూ కొందరు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయనపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(a) ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, వాక్‌ స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశ సైనికులను కించపరిచే హక్కు ఎవరికీ లేదు’’ అని న్యాయస్థానం పేర్కొంటూ రాహుల్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rahul Gandhi
Allahabad High Court
Indian Army
Bharat Jodo Yatra
China

More Telugu News