Bilawal Bhutto: అమెరికాలో బిలావల్ భుట్టో శాంతి వచనాలు.. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీవ్ర ఆగ్రహం

Bilawal Bhuttos Peace Remarks Angers BJP MP Tejasvi Surya
  • అమెరికాలో పాక్ నేత బిలావల్ భుట్టో శాంతి వచనాలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అభ్యంతరం
  • శాంతి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తేజస్వీ సూర్య ఎద్దేవా
  • భారత్‌తో చర్చలకు సిద్ధమంటూ ఐరాసలో బిలావల్ భుట్టో ప్రకటనపై కౌంటర్
పాకిస్థాన్ నేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అమెరికా పర్యటనలో శాంతి గురించి మాట్లాడటంపై బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య తీవ్రంగా స్పందించారు. బిలావల్ నోటి నుండి శాంతి వచనాలు వింటుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్వీ సూర్య మాట్లాడుతూ, "భుట్టో తనను తాను శాంతి ప్రతినిధిగా అభివర్ణించుకుంటున్నారు. అంతేకాకుండా, శాంతి గురించి మాట్లాడుతున్నారు. ఇది చూడటానికి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది" అని ఎద్దేవా చేశారు.

పాకిస్థాన్ నకిలీ హీరోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని, యుద్ధంలో విఫలమైన వారికి ఫీల్డ్ మార్షల్స్‌గా పదోన్నతులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. "వారికి అసలైన హీరోలు ఎలా ఉంటారో తెలియదు. చైనాకు చెందిన చౌకబారు ఆయుధాలతో పాకిస్థాన్ కాలం గడుపుతోంది. కాబట్టి, మా దేశంలోని అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మా బలగాలను, మా బలమైన ప్రజాస్వామ్య నాయకత్వాన్ని వారు జీర్ణించుకోవడం కష్టమే" అని తేజస్వీ సూర్య అన్నారు.

బిలావల్ భుట్టో ఏమన్నారంటే...

'ఆపరేషన్ సిందూర్‌'పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలోనే పాకిస్థాన్ కూడా తన మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సారథ్యంలో ఓ ఎంపీల బృందాన్ని అమెరికాకు పంపింది. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో బిలావల్ భుట్టో ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన నిఘా సంస్థలు పరస్పరం సహకరించుకుంటే ఉగ్రవాద ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అణ్వస్త్ర దేశాలైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధం మళ్లీ తలెత్తే అవకాశాలు పెరిగాయే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు.

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ నదీ జలాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని బిలావల్ ఆరోపించారు. దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారంతో పాటు పలు ఇతర కీలక అంశాలపై భారత్‌తో విస్తృతస్థాయిలో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని బిలావల్ భుట్టో పేర్కొన్నారు.
Bilawal Bhutto
Tejasvi Surya
India Pakistan
US Visit
Shashi Tharoor
Terrorism
Sindh River

More Telugu News