Sudhakar: ఛత్తీస్ గఢ్ లో భీకర ఎన్‌కౌంటర్... మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి

Maoist Leader Sudhakar Killed in Encounter in Chhattisgarh
  • బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్
  • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ హతం
  • సుధాకర్ తలపై రూ. కోటి రివార్డు
  • తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్
  • కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్
  • ఆరు నెలల్లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యుల హతం
మావోయిస్టు పార్టీకి మరో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ సుధాకర్‌, భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతమైన నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో మావోయిస్టు సీనియర్‌ నాయకులు సమావేశమయ్యారన్న కచ్చితమైన సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో, గురువారం తెల్లవారుజామున మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సుధాకర్‌ మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

సుధాకర్‌... మావోయిస్టు వర్గాల్లో గౌతమ్‌, ఆనంద్‌, చంటి బాలకృష్ణ, రామరాజు, సోమన్న వంటి అనేక మారుపేర్లతో సుపరిచితుడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామం. గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న సుధాకర్‌పై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో కూడా ఆయన పాల్గొన్నారు.

బీజాపుర్‌ ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర యాదవ్‌ ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనను ధృవీకరించారు. అయితే, సుధాకర్‌ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం బీజాపుర్‌ అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

గత ఆరు నెలల కాలంలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు కీలక నాయకులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేయడం, మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణిస్తున్నారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ఎదురుదెబ్బ.

ఇదే ప్రాంతంలో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు!

ఇదే ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్‌ పార్టీ మాజీ ప్రెస్‌ ఇన్‌ఛార్జి బండి ప్రకాశ్‌, స్పెషల్‌ జోన్‌ కమిటీ సీనియర్‌ లీడర్‌ పాపారావు కూడా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశ్‌... మావోయిస్టుల నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్‌లోని కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాడని, ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. ఇక పాపారావు గెరిల్లా యుద్ధతంత్రంలో నిపుణుడని, ఐఈడీ దాడులతో సహా అనేక హింసాత్మక ఘటనల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడని, అతడిపై రూ.20 లక్షల రివార్డు ఉందని తెలిపారు. అయితే, వీరిద్దరి ఆచూకీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో తమ గాలింపును ముమ్మరం చేశాయి.
Sudhakar
Maoist leader
encounter
Chhattisgarh
Bijapur
Nambala Kesava Rao
Telangana
Bandi Prakash
security forces
anti-Naxal operations

More Telugu News