Vijay Mallya: ఆర్‌సీబీని అందుకే కొన్నా.. కోహ్లీని అలా తీసుకున్నా: విజయ్ మాల్యా

Vijay Mallyas Big RCB Revelation The Business Behind Decision To Buy Team In 2008
  • ఆర్‌సీబీని కొన్నది ప్రధానంగా వ్యాపారానికేనన్న విజయ్ మాల్యా
  • కింగ్‌ఫిషర్, రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ల ప్రచారమే తన లక్ష్యమని వెల్లడి
  • యువకుడిగా ఉన్నప్పుడే కోహ్లీ ప్రతిభను గుర్తించానని వ్యాఖ్య
  • 18 ఏళ్లుగా ఆర్‌సీబీతోనే కోహ్లీ కొనసాగడం విశేషమని ప్రశంస
  • ఆర్‌సీబీ టైటిల్‌ గెలవడంతో తన కల నెరవేరినట్లేనని హర్షం
  • 2008లో 111.6 మిలియన్ డాలర్లకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు
ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)ను ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన వేళ, ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2008లో ఆర్‌సీబీ ఫ్రాంచైజీని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో, అప్పటి యువ ఆటగాడు విరాట్ కోహ్లీని జట్టులోకి ఎలా తీసుకున్నారో ఆయన తాజాగా వివరించారు.

విజయ్ మాల్యా మాట్లాడుతూ... లలిత్ మోదీ ఐపీఎల్ గురించి వివరించిన తర్వాతే తనకు ఈ లీగ్‌పై ఆసక్తి కలిగిందని తెలిపారు. "ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి, ఐపీఎల్ జట్లను వేలం వేస్తున్నారని, మీరు కొనుగోలు చేస్తారా? అని అడిగారు" అని మాల్యా గుర్తుచేసుకున్నారు. తొలుత తాను మూడు ఫ్రాంచైజీల కోసం బిడ్ వేసినప్పటికీ, ముంబై జట్టును తృటిలో కోల్పోయి, చివరికి బెంగళూరు ఫ్రాంచైజీని దక్కించుకున్నట్లు చెప్పారు.

తాను క్రికెట్‌పై ఉన్న అమితమైన ఇష్టంకొద్దీనో, లేదా తన విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించుకోవడానికో ఆర్‌సీబీని కొనుగోలు చేశానని చాలామంది అనుకుంటారని, కానీ అది నిజం కాదని మాల్యా స్పష్టం చేశారు. "నా ప్రాథమిక ఉద్దేశం వ్యాపారమే. రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్ వంటి నా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికే ఆర్‌సీబీని కొన్నాను" అని ఆయన తెలిపారు. 2008లో సుమారు 111.6 మిలియన్ అమెరికన్ డాలర్లకు (అప్పటి విలువ ప్రకారం దాదాపు 600-700 కోట్ల రూపాయలు) ఆర్‌సీబీని కొనుగోలు చేశానని, ఇప్పుడది ఒక అత్యుత్తమ పెట్టుబడి అని ఆయన అభివర్ణించారు.

ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత విజయ్ మాల్యా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్)లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ ఛాంపియన్ అయింది. 2025 టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా ఆడారు" అని పేర్కొన్నారు.

ఐపీఎల్ ఆరంభ వేలంలో విరాట్ కోహ్లీని ఎంచుకోవడం తన అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాల్లో ఒకటని మాల్యా తెలిపారు. కోహ్లీ గత 18 సీజన్లుగా ఆర్‌సీబీకే విధేయత చూపిస్తూ, లీగ్‌లో 8వేల‌కు పైగా పరుగులు, 8 సెంచరీలు, 63 అర్ధసెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడని గుర్తుచేశారు. "నేను ఆర్‌సీబీని స్థాపించినప్పుడు, ఏదో ఒకరోజు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు రావాలని కలలు కన్నాను. లెజెండరీ కింగ్ కోహ్లీని యువకుడిగా ఉన్నప్పుడే ఎంచుకునే అదృష్టం నాకు దక్కింది. అతను 18 ఏళ్లుగా ఆర్‌సీబీతోనే ఉండటం విశేషం" అని మాల్యా అన్నారు.

రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో 2016లో విజయ్ మాల్యా ఆర్‌సీబీ యాజమాన్యాన్ని కోల్పోయినప్పటికీ, ఆర్‌సీబీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపును తీసుకురావడంలోనూ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్లను జట్టులోకి తీసుకురావడంలోనూ ఆయన పాత్ర ఉందని క్రీడా విశ్లేషకులు చెప్పే మాట‌. ఈ వారం కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న అపురూప దృశ్యాన్ని చూసేందుకు డివిలియర్స్, గేల్ కూడా హాజరవడం గమనార్హం.
Vijay Mallya
RCB
Royal Challengers Bangalore
Virat Kohli
IPL
Indian Premier League
Lalit Modi
AB de Villiers
Chris Gayle
IPL 2025

More Telugu News