Mega DSC 2025: ఏపీలో ఉపాధ్యాయ కొలువుల జాతర: మెగా డీఎస్సీ-2025 నేటి నుంచి ప్రారంభం

AP Mega DSC 2025 Exams Start Today
  • నేటి నుంచి మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు
  • ఈ నెల 30 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహణ
  • రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
  • మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు, 154 పరీక్షా కేంద్రాలు
  • పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతి, కట్టుదిట్టమైన భద్రత
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గాను, రాష్ట్రవ్యాప్తంగా 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు.

ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీ, ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పరీక్షా సమయం మూడు గంటలు కాగా, మిగిలిన పోస్టులకు రెండున్నర గంటలుగా నిర్దేశించారు. పీజీటీ, ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టెట్ అర్హత అవసరం లేనందున వీరికి 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ పోస్టులకు 80 మార్కులకు 160 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించి, టెట్ మార్కులకు వెయిటేజీ ఇస్తారు. డీఎస్సీ పరీక్షల్లో రుణాత్మక మార్కులు (మైనస్ మార్కులు) ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతిరోజూ ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, 9:30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 5 గంటల వరకు, 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల కల్లా, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యేవారు మధ్యాహ్నం 2 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. అభ్యర్థులు తమతో పెన్నులను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటివి అనుమతించరు. రఫ్ వర్క్ కోసం పేపర్లు కూడా తీసుకురావద్దని, అదనపు షీట్లను పరీక్షా కేంద్రంలోనే అందిస్తామని అధికారులు తెలిపారు.

ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 87.8 శాతం మంది అభ్యర్థులకు వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత జిల్లాలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందని, అభ్యర్థులు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తిచేసుకోవాలని స్పష్టం చేశారు. హాల్‌టికెట్, ఫొటో గుర్తింపు కార్డు లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.
Mega DSC 2025
AP DSC
Teacher Recruitment
MV Krishna Reddy
Andhra Pradesh Education
AP Government Jobs
Teacher Jobs
DSC Exam
School Education
AP TET

More Telugu News