Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు.. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక

Uttam Kumar Reddy Warns Fight for Telangana Rights on AP Project
  • బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి ఆవేదన
  • ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని వెల్లడి
  • బనకచర్లను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని తేల్చిచెప్పిన మంత్రి
  • కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని విమర్శలు
బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కార నిబంధనలకు, జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు, అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ అంశంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఇప్పటికే లేఖలు రాశామని మంత్రి తెలిపారు.

కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిపిన సంప్రదింపుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తూ, "ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్దకు రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పాటిల్ చెప్పారు. చట్ట ప్రకారమే ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు" అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఉల్లంఘనలను తాము రాసిన లేఖల్లో సమగ్రంగా వివరించామని తెలిపారు. చట్టవిరుద్ధమైన పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తాము భావించడం లేదని, ఒకవేళ తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. "తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని మంత్రి ఉద్ఘాటించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆయన కోరారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 724 టీఎంసీలు కాగా, బీఆర్ఎస్ హయాంలో 1,254 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం సహకరించింది" అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన వృధా ఖర్చును ఇతర కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై పెట్టి ఉంటే అవన్నీ పూర్తయ్యేవని అభిప్రాయపడ్డారు.

"తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల రూ.68 వేల కోట్ల అదనపు భారం పడింది. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.
Uttam Kumar Reddy
Telangana
Andhra Pradesh
Banakacherla Project
Krishna River

More Telugu News