TTD: శ్రీవారి లడ్డూ పేరుతో వ్యాపారం.. పలు సంస్థలకు టీటీడీ నోటీసులు

TTD Issues Notices to Companies Using Srivari Laddu Name
  • శ్రీవారి లడ్డూ పేరు దుర్వినియోగంపై టీటీడీ కఠిన వైఖరి
  • భౌగోళిక సూచిక (జీఐ) హక్కులు ఉల్లంఘించిన కొన్ని సంస్థలకు లీగల్ నోటీసులు
  • ఇది కేవలం స్వీట్ కాదు, కోట్ల మంది భక్తుల విశ్వాసమన్న టీటీడీ ఈవో  
  • లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టీకరణ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక (జీఐ) హక్కులను ఉల్లంఘిస్తున్న పలు సంస్థలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. కోట్ల మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్న కొన్ని సంస్థలకు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవారి లడ్డూకు 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ ద్వారా పేటెంట్ హక్కులు లభించాయి. అంతకుముందు 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద టీటీడీ ఈ హక్కులను పొందింది. అయినప్పటికీ, కొన్ని స్వీట్ షాపులు, ఆన్‌లైన్ సంస్థలు 'శ్రీవారి లడ్డూ' పేరుతో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో, టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ న్యాయ విభాగం అధికారులు ఢిల్లీకి చెందిన సహదేవ లా చాంబర్స్ ద్వారా చర్యలు చేపట్టారు. పుష్‌ మై కార్ట్, ట్రాన్సాక్ట్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఇండియా స్వీట్‌ హౌస్‌ వంటి సుమారు ఐదారు సంస్థలకు మే 31న నోటీసులు పంపారు. ఈ నోటీసులకు పుష్‌ మై కార్ట్‌ సంస్థ తక్షణమే స్పందించి తమ ఉత్పత్తుల జాబితా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును తొలగిస్తున్నట్లు తెలియజేసింది. మరికొన్ని సంస్థలు కూడా ఇదే విధంగా లడ్డూ పేరును తొలగించినట్లు సమాచారం.

ఈ విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ "తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కేవలం ఒక స్వీట్ పదార్థం కాదు, అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన స్వామివారి లడ్డూ ప్రసాదం పేరును తప్పుగా వాడితే ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోం" అని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రుచి, శుచి, నాణ్యతతో కూడిన లడ్డూలను భక్తులకు అందించడంతో పాటు, లడ్డూ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
TTD
Tirumala Tirupati Devasthanam
Srivari Laddu
Laddu Prasadam
Geographical Indication
GI Tag
Legal Notice
Shyamala Rao
Push My Cart
India Sweet House

More Telugu News