Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' బ‌డ్జెట్‌పై జ్యోతికృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Hari Hara Veera Mallu Budget Talk by Jyothi Krishna
  • పవన్ కల్యాణ్ హీరోగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' 
  • ఈ సినిమా నిర్మాణానికి రూ. 250కోట్ల భారీ బ‌డ్జెట్‌
  • మ‌చ‌లీప‌ట్నంలో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో వెల్ల‌డించిన జ్యోతికృష్ణ‌
  • ఈ మూవీ చూసి త‌న‌ను ప‌వ‌న్ మెచ్చుకున్నార‌న్న ద‌ర్శ‌కుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం విడుద‌ల ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా పడగా... తాజాగా మ‌రోసారి మేక‌ర్స్ వాయిదా వేశారు. ముందుగా ప్రకటించినట్టు జూన్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, సినిమా ఎప్పుడొచ్చినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్ విడుద‌ల‌ అయ్యాక సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని చెబుతున్నారు. 

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఏ.ఎం. జ్యోతికృష్ణ తాజాగా ఈ చిత్ర నిర్మాణ వివరాలను పంచుకున్నారు. నిన్న మ‌చ‌లీప‌ట్నంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ... సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో "హరి హర వీరమల్లు" రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక‌, ఈ మూవీ చూసి పవన్ త‌న‌ను ప్రశంసించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 

''హరిహర వీరమల్లు సినిమా చూసి పవన్ కల్యాణ్ నన్ను ప్రశంసించారు. నాతో ఇంకో సినిమా చేయాలని అన్నారు. ఒక్కసారి కాదు, మూడు సార్లు ఈ సినిమా చూశారు. గంటసేపు నన్ను అప్రిసియేట్ చేశారు. అసురణం పాట ఆయనకు చాలా ఇష్టం. 500 సార్లు చూసి ఉంటారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. అతను ప్రజల మనిషి'' అని జ్యోతికృష్ణ చెప్పారు.

ఇక‌, ఇది ఒక చారిత్రక కథ కావడంతో ఆ కాలపు వాతావరణాన్ని తెరపై వాస్తవికంగా చూపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. "సెట్టింగుల నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతీది ఆ కాలానికి అద్దం పట్టేలా ఉండాలి. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వస్తోంది" అని జ్యోతి కృష్ణ తెలిపారు.

ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, విజువల్స్ మరియు సౌండ్ ఎలిమెంట్స్‌ను మరింత మెరుగుపరిచి, ప్రేక్షకులకు ఒక అసాధారణమైన అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నామ‌న్నారు. 

ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Jyothi Krishna
Nidhi Agarwal
MM Keeravani
Telugu Movie
Historical Drama
Mega Surya Production
A Dayakar Rao
Asuranam Song

More Telugu News