Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. మరోసారి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rahul Gandhi Alleges Match Fixing in Maharashtra Elections
  • బీజేపీ కుట్ర చేసిందంటూ ఐదు పాయింట్లతో తీవ్ర విమర్శలు
  • ఎన్నికల వ్యవస్థనే మార్చేశారని మండిపడ్డ కాంగ్రెస్ మాజీ చీఫ్
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన
  • రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ 'మ్యాచ్ ఫిక్సింగ్'కు పాల్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, బీజేపీ ఐదు దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నీరుగార్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
 
 2024 లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి మొత్తం 288 స్థానాలకు గాను 235 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ మాత్రమే 132 స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. ఇది రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు, కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కేవలం 50 సీట్లకే పరిమితమైంది.

ఈ ఫలితాలపై గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తాజాగా తన వ్యాసంలో "ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌ను తారుమారు చేయడం, ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం" వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. "ఇది చిన్నపాటి మోసం కాదు, మన జాతీయ సంస్థలను కైవసం చేసుకుని పారిశ్రామిక స్థాయిలో చేసిన రిగ్గింగ్" అని ఆయన పేర్కొన్నారు.

2023లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రాహుల్ తప్పుపట్టారు. ఈ చట్టం ద్వారా, కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చారని, ఇది కార్యనిర్వాహక వర్గానికి అనుకూలంగా ఉందని ఆయన వాదించారు. "ముఖ్యమైన సంస్థలో తటస్థ మధ్యవర్తిని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది," అని రాహుల్ రాశారు.

అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రతినిధి తుహిన్ సిన్హా మాట్లాడుతూ, "రాహుల్ గాంధీ దేశంలోని రాజ్యాంగ సంస్థలను కించపరుస్తున్నారు. ఈ సమస్యలపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివరంగా స్పందించింది" అని తెలిపారు. తమ పనితీరు స్వతంత్రంగా ఉంటుందని, రాజ్యాంగబద్ధమైన చట్టాలకు కట్టుబడి ఉంటామని ఎన్నికల సంఘం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది.
Rahul Gandhi
Maharashtra Elections
Match Fixing
BJP
Eknath Shinde
Ajit Pawar
Election Commission
Indian National Congress
Political Allegations
India

More Telugu News