Rahul Gandhi: రాహుల్ గాంధీ 'మ్యాచ్ ఫిక్సింగ్' వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ

Rahul Gandhi Accuses BJP of Match Fixing in Maharashtra Elections
  • మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపణ
  • ఇది ప్రజాస్వామ్య రిగ్గింగ్‌కు నిదర్శనమని వ్యాఖ్య
  • ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదుపై తీవ్ర విమర్శలు
  • బీహార్ ఎన్నికల్లోనూ ఇలాంటివి జరుగుతాయని రాహుల్ హెచ్చరిక
  • రాహుల్ ఆరోపణలను ఖండించిన భారతీయ జనతా పార్టీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో బీజేపీ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 'మ్యాచ్ ఫిక్సింగ్'కు పాల్పడి విజయం సాధించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య రిగ్గింగ్‌కు ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించిన ఆయన, ఇదే తరహా పరిస్థితి బీహార్‌లోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రాహుల్ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

"ప్రజాస్వామ్య రిగ్గింగ్‌కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణ" అంటూ రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఎన్నికల కమిషన్ నియామకం దగ్గర నుంచి, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్‌లో అవకతవకలు, ఆధారాలను మరుగుపరచడం వంటి అనేక చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. "బీజేపీ ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది. మోసం చేసే పార్టీ ఆటలో గెలవొచ్చు, కానీ అలాంటి గెలుపు వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తుంది" అని రాహుల్ పేర్కొన్నారు.

ఈ అంశాలపై ప్రజలంతా ఆధారాలను పరిశీలించి, సమాధానాలు డిమాండ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. "ఎందుకంటే మహారాష్ట్ర తర్వాత బీహార్ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీకి ఓటమి భయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవే పునరావృతం అవుతాయి. మ్యాచ్‌ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివి" అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విధమైన అభిప్రాయాలను ఆయన ఒక జాతీయ మీడియాకు రాసిన వ్యాసంలోనూ ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ పలుమార్లు వివరంగా సమాధానాలు ఇచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ పదేపదే దేశంలోని వ్యవస్థలను తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమి 235 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి సొంతంగా 132 సీట్లు వచ్చాయి.
Rahul Gandhi
BJP
Maharashtra Election
Match Fixing Allegations
Indian Politics

More Telugu News