Ramoji Rao: రామోజీరావు లేకపోయినా... ఆయన స్ఫూర్తి అందరిలో ఉంది: సీఎం చంద్రబాబు

Ramoji Rao Inspiration Lives On Says CM Chandrababu
  • రేపు రామోజీరావు ప్రథమ వర్ధంతి
  • సీఎం చంద్రబాబు నివాళి
  • ఎక్స్ వేదికగా రామోజీ సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు ప్రథమ వర్ధంతి (జూన్ 8) సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన స్ఫూర్తి తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

"తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు ఆయన మన మధ్య లేకపోయినా... విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు గారు ఎగరేసిన అక్షర బావుటా నిత్య సత్యమై, నిత్య నూతనమై ప్రతి రోజూ ఉషోదయాన నినదిస్తూనే ఉంది. తలవంచని నైజం, వ్యాపారాల్లో కూడా సమాజ హితం చూసిన వైనం ఆయనను సమున్నత స్థాయిలో నిలబెట్టింది. ఈనాడు సంస్థల ద్వారా అరాచక వ్యవస్థలపై ఆయన చేసిన పోరాటాలు....ప్రజల సమస్యలపై ఆయన చేసిన యుద్ధాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయి. 

రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపం. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని,  ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గం అని పాత్రికేయానికే కొత్త అర్థాన్ని ఇచ్చిన మహర్షి రామోజీరావు. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన, సమాజాన్ని అనునిత్యం చైతన్యవంతం చేసిన వారిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావు గారు తెలుగు జాతి సంపద. ఆయన వెళ్లిపోయినా ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో నిలిచే ఉంటుంది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దాం" అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Ramoji Rao
Chandrababu Naidu
Eenadu
Telugu Journalism
Padma Vibhushan
Ramoji Group
Andhra Pradesh
Media Mogul
Telugu People
Inspiration

More Telugu News