Meghalaya Honeymoon Murder: భర్త హత్యకు భార్య పక్కా ప్లాన్.. మేఘాలయ హనీమూన్ ఘటనలో షాకింగ్ నిజాలు!

Sonam Raghuwanshi Planned Husbands Murder in Meghalaya Honeymoon
  • మేఘాలయ హనీమూన్‌లో ఇండోర్ వాసి రాజా రఘువంశీ దారుణ హత్య
  • భార్య సోనమ్ రఘువంశీనే కిరాయి హంతకులతో చంపించిందని పోలీసుల వెల్లడి
  • భర్త హత్య కేసులో సోనమ్ సహా మొత్తం నలుగురి అరెస్ట్
  • ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు లొంగిపోయిన భార్య సోనమ్
  • కేవలం 7 రోజుల్లోనే కేసును ఛేదించిన మేఘాలయ పోలీసులు
  • నిందితులను పట్టుకోవడంలో పలు రాష్ట్రాల పోలీసుల సమన్వయం
కొత్త జీవితం ప్రారంభిద్దామని హనీమూన్‌కు వెళ్లిన ఓ నవ దంపతుల పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది. భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన కేసులో భార్యే ప్రధాన సూత్రధారి అని తేలడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేఘాలయలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో మృతుడి భార్యతో సహా మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి అత్యంత సన్నిహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ ఇటీవలే వివాహం చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అంతకుముందు షిల్లాంగ్‌లోని ఓ హోటల్ బయట, ఆ తర్వాత నాంగ్రియాట్ గ్రామంలో మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పరిధిలోని సోహ్రా ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఆయ‌న‌ను కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు నిర్ధార‌ణ అయింది. సంఘటనా స్థలం నుంచి పలు విలువైన వస్తువులు కూడా మాయమైనట్లు తేలింది.

మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావించినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. రాజా రఘువంశీ హత్య వెనుక ఆయన భార్య సోనమ్ హస్తం ఉందని, ఆమెనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించిందని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాయికి మాట్లాడుకుని సోనమ్ ఈ ఘాతుకానికి పాల్పడిందని వారు వెల్లడించారు. కొన్ని రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన సోనమ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక లీడ్‌ లభించింది. అనంతరం ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు సమన్వయంతో రాత్రిపూట దాడులు నిర్వహించి, హత్యలో పాలుపంచుకున్న మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసును కేవలం ఏడు రోజుల్లో ఛేదించిన రాష్ట్ర పోలీసుల పనితీరును మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రశంసించారు. "ఏడు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు... చాలా బాగా పనిచేశారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. కాగా, రాజా రఘువంశీ హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. 
Meghalaya Honeymoon Murder
Sonam Raghuwanshi
Raja Raghuwanshi
Indore
Shillong
East Khasi Hills
Crime News
Honey Moon Killing
Murder Conspiracy
Ghazipur

More Telugu News