Manish Sisodia: ఏసీబీ విచారణకు మనీశ్ సిసోడియా గైర్హాజరు

Manish Sisodia Absent from ACB Inquiry in Corruption Case
  • స్కూళ్ల నిర్మాణంలో రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు
  • మాజీ మంత్రులు సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై కేసులు
  • సోమవారం ఏసీబీ విచారణకు హాజరుకాని మనీశ్ సిసోడియా
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, తరగతి గదుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు డుమ్మా కొట్టారు. సుమారు రూ. 2,000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఏసీబీ అధికారులు వారికి సమన్లు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం మనీశ్ సిసోడియా ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా, ఆయన రాలేదని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. తనకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నందున సోమవారం విచారణకు రాలేకపోతున్నానని సిసోడియా తన తరఫు న్యాయవాది ద్వారా ఏసీబీకి సమాచారం అందించినట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో సిసోడియాకు మరోసారి సమన్లు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఏసీబీ అధికారులు గత శుక్రవారం విచారించారు. అయితే, ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధిత శాఖల అధికారులే బాధ్యులంటూ జైన్ సమాధానమిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆర్కిటెక్ట్‌ల నియామకంలో అక్రమాలు జరిగాయన్న అంశంపై ఆయన సరైన వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది.
Manish Sisodia
Delhi
ACB
corruption case
Satyendar Jain
AAP
government schools

More Telugu News