Rahul Kumar Shah: బీహార్‌‌లో షాకింగ్ ఘటన.. ఏడాది పాటు నకిలీ పోలీస్ స్టేషన్.. యువత నుంచి లక్షల వసూళ్లు!

Bihar fake police station scam exposed in Purnia district
  • పూర్ణియా జిల్లా మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా నిర్వాకం
  •  ఉద్యోగాల పేరుతో యువత నుంచి లక్షల రూపాయల వసూలు
  •  గ్రామీణ రక్షాదళ్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ల నియామకాలు
  •  నకిలీ యూనిఫాంలు, ఐడీ కార్డులతో పెట్రోలింగ్, దాడులు
  •  గుట్టురట్టవడంతో నిందితుడు పరార్.. పోలీసుల గాలింపు
నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, దాదాపు ఏడాది పాటు యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు కొనసాగించిన షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాహుల్‌కుమార్‌ షా పూర్ణియా జిల్లా పరిధిలోని మోహని గ్రామంలో ఈ నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. గ్రామీణ రక్షాదళ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానిక యువతను నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. కానిస్టేబుల్, చౌకీదార్ వంటి పోస్టుల పేరుతో ఈ అక్రమ నియామకాలు చేపట్టాడు. ఒక్కో యువకుడి నుంచి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు దండుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా డబ్బులు చెల్లించిన వారికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు కూడా అందజేశాడు. వారితో గ్రామాల్లో పెట్రోలింగ్ చేయించడం, మద్యం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించడం వంటి పనులు చేయించాడు. ఈ దాడుల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం తాను ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని తన కింద పనిచేస్తున్న నకిలీ ఉద్యోగులకు పంచిపెట్టేవాడు. అంతేకాకుండా, అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని లంచాలు తీసుకుని తిరిగి వారికే అప్పగించేవాడు.

దాదాపు ఏడాది పాటు ఈ నకిలీ పోలీసుల దందా ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. అయితే, ఇటీవల ఈ వ్యవహారం గుట్టు రట్టవడంతో ప్రధాన సూత్రధారి అయిన రాహుల్‌కుమార్‌ షా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  
Rahul Kumar Shah
Bihar fake police station
fake police station
Purnia district
Mohani village
police recruitment scam
police constable jobs
crime news
Bihar news

More Telugu News