Revanth Reddy: ఖర్గే, రాహుల్ గాంధీలతో ఢిల్లీలో సీఎం రేవంత్ మంతనాలు

Revanth Reddy Meets Kharge and Rahul Gandhi in Delhi
  • మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై చర్చ
  • ఎస్సీ వర్గీకరణ, బీసీ జనగణనపై భారీ సభలకు సన్నాహాలు
  • మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్ఠానం సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇటీవల పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే వారికి శాఖల కేటాయింపు అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు. కొందరు ప్రస్తుత మంత్రుల శాఖలలో కూడా మార్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా, ఇతర కీలక అంశాలపైనా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపైనా విస్తృతమైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు సంబంధించిన తేదీలను త్వరగా ఖరారు చేయాలని, వాటికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు.

తెలంగాణలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రికి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు.
Revanth Reddy
Telangana CM
Mallikarjun Kharge
Rahul Gandhi
Telangana cabinet expansion
AICC

More Telugu News