TSPSC Group 3: టీజీపీఎస్సీ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్!

TSPSC Group 3 Certificate Verification Postponed in Telangana
  • టీజీపీఎస్సీ గ్రూప్-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా
  • జూన్ 18 నుంచి జరగాల్సిన ప్రక్రియ నిలిపివేత
  • ముందుగా గ్రూప్-2 నియామకాలు పూర్తి చేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి
  • అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడి
  • కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన అధికారులు
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య గమనిక. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మంగళవారం సాయంత్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 18వ తేదీ నుంచి జులై 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ జూన్ 6న ఒక షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కమిషన్ తాజాగా వెల్లడించింది.

గ్రూప్-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించడానికి ముందే గ్రూప్-2 నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు అభ్యర్థుల నుంచి టీజీపీఎస్సీకి విజ్ఞప్తులు అందాయి. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, గ్రూప్-3 ధృవపత్రాల పరిశీలనను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తన వెబ్‌నోట్‌లో పేర్కొంది.

టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ ఈ విషయంపై స్పందిస్తూ, గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన కొత్త తేదీల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు తదుపరి ప్రకటనల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించారు.
TSPSC Group 3
Telangana jobs
Group 3 exams
TSPSC certificate verification

More Telugu News