Chandrababu Naidu: విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu Reviews Civil Aviation University Plan for Visakha
  • కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలన్న సీఎం
  • విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఆదేశం
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలో శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ వర్చువల్‌గా హాజరయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణాలు ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ అంశాలపై ఆయన ఎయిర్‌పోర్టు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం వంటి అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టెర్మినల్ భవనం ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్‌లు, ప్రయాణికుల లాంజ్‌లు వంటి ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మన సంప్రదాయ నృత్యకళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపోదించాల్సిందిగా సీఎం చెప్పారు.

రాష్ట్రంలో కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్ ఫీజిబిలిటి రిపోర్టుపై పని చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూ పరిశీలన జరుగుతోందని, దీనికి సంబంధించి రైట్స్ బృందం త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.

ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలో ప్రాజెక్టును చేపడతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి 40 శాతం మేర కార్యకలాపాలు పెరిగాయని వివరించారు. విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశీయంగా వివిధ నగరాలకు కనెక్టివిటి పెంచేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. ట్రూజెట్ సంస్థ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబరు నుంచి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చిందన్నారు.

విజయవాడ- సింగపూర్, తిరుపతి - మస్కట్ ల మధ్య కూడా త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వివరించారు. సెప్టెంబరు తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయన్నారు. ఖతార్ ఏవియేషన్ ఫండ్ భోగాపురం విమానాశ్రయం వద్ద పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని తెలిపారు.
Chandrababu Naidu
Visakha
Civil Aviation University
Vijayawada Airport
Ram Mohan Naidu

More Telugu News