Jagan Mohan Reddy: చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం వారికి శాపంగా మారింది: జగన్ విమర్శలు

Jagan Slams Chandrababu Rule as Calamity for Farmers
  • రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు
  • పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన
  • తమ పాలనలో రైతు రాజ్యం నడిచిందని, రైతులకు స్వర్ణయుగమని వ్యాఖ్య
  • పొగాకు రైతులకు ధర తగ్గడం, కొనుగోళ్లు లేకపోవడంతో తీవ్ర నష్టమని ఆరోపణ
  • రైతులను వెంటనే ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం వారిని పట్టించుకునే స్థితిలో లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం అన్నదాతలకు శాపంగా పరిణమించిందని ఆయన అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారని జగన్ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కొండెపి ప్రాంతాల్లో ఇటీవలే ఇద్దరు రైతులు తనువు చాలించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితుల్లో రైతులున్నారని ఆయన ఆరోపించారు.

మాది రైతు రాజ్యం, ఇది దళారీల రాజ్యం

తమ ప్రభుత్వ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, అది రైతులకు స్వర్ణయుగమని జగన్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందించామని, కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతు భరోసా సాయం అందడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటు మరో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ గత ఏడాది ఆ ఇరవై వేల రూపాయలను ఎగ్గొట్టారని ఆరోపించారు. "మోదీ తన వాటా ఇచ్చారు, చంద్రబాబు మాత్రం ఎగనామం పెట్టారు" అని ఆయన అన్నారు.

తమ హయాంలో ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించామని, అదనంగా పది వేల రూపాయల వరకు అందించామని తెలిపారు. పారదర్శకంగా ఉచిత బీమా పథకాన్ని అమలు చేశామని, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు వెన్నెముకగా నిలిచాయని వివరించారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, మార్కెట్‌లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేశామన్నారు. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా, రాష్ట్రం తరఫున అనేక పంటలకు కనీస మద్దతు ధర కల్పించామని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఐదెకరాల మిర్చి రైతులకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు.

కూటమి పాలనలో అంతా అధ్వానం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బీమా పథకాన్ని ఎత్తివేశారని జగన్ ఆరోపించారు. దళారుల ప్రమేయం లేకుండా ఇప్పుడు పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని, ఈ-క్రాప్ వ్యవస్థను నీరుగార్చారని విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీని గాలికొదిలేశారని, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పొగాకు రైతుల కష్టాలను ప్రస్తావిస్తూ, 2023-24లో కిలో పొగాకు 366 రూపాయలకు అమ్ముడుపోగా, ఇప్పుడు 240 రూపాయలు కూడా రావడం లేదని అన్నారు. గతంలో క్వింటాల్ పొగాకు 24 వేల రూపాయలకు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడని తెలిపారు. 220 మిలియన్ టన్నుల పొగాకును సేకరించాల్సి ఉండగా, కేవలం 40 మిలియన్ టన్నులనే సేకరించారని, నాణ్యమైన హైగ్రేడ్ పొగాకుకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆరోపించారు.

పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు 80 వేల రూపాయల వరకు నష్టపోతున్నారని వివరించారు. తమ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మార్కెట్‌లో పోటీ పెంచామని, ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్క్‌ఫెడ్ ఎందుకు వేలంలో పాల్గొనడం లేదని, చంద్రబాబుకు, దళారులకు మధ్య ఉన్న సంబంధాల వల్లే రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలే

చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని జగన్ విమర్శించారు. పొగాకు వేసుకోమని చెప్పి ఇప్పుడు రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh farmers
Chandrababu Naidu
farmer suicides
crop prices
Rythu Bharosa
tobacco farmers
Markfed
AP politics

More Telugu News