Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కు కళ్లు చెదిరే ఆస్తులు

Kaleshwaram Project Engineer Noone Sridhar Assets Seized in ACB Raids
  • పదవిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు కూడబెట్టిన నూనె శ్రీధర్‌
  • విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య భవనాలతో పాటు 16 ఎకరాల వ్యవసాయ భూమి
  • ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు, అరెస్టు చేసిన అధికారులు
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో ఒక విల్లా, షేక్‌పేటలో ఫ్లాట్‌, అమీర్‌పేటలో వాణిజ్య భవనంతో పాటు కరీంనగర్‌లో మూడు ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో 3 ఇండిపెండెంట్‌ ఇళ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, వివిధ ప్రాంతాల్లో మరో 19 ఓపెన్‌ ప్లాట్లు శ్రీధర్‌ పేరు మీద ఉన్నట్లు తేలింది. వీటితో పాటు రెండు కార్లు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలు కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

నూనె శ్రీధర్‌ ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌-8లో ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తన పదవిని అడ్డం పెట్టుకుని శ్రీధర్‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన నీటిపారుదల శాఖలో కలకలం రేపింది.

Kaleshwaram Project
Noone Sridhar
ACB Raids
Telangana Irrigation
Disproportionate Assets Case
Anti Corruption Bureau
SRSP Division
Irrigation Engineer Association
Corruption Case

More Telugu News