Balaram Bhargava: 'కొవిడ్ కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు': డాక్టర్ బలరాం భార్గవ

Balaram Bhargava No Need to Worry About New COVID Variant
  • కొవిడ్ కొత్త వేరియంట్ పై ఐసీఎంఆర్ మాజీ డీజీ డాక్టర్ బలరాం భార్గవ భరోసా
  • సార్స్ కోవ్ 2 వైరస్ సహజ పరిణామమే కొత్త ఎక్స్ ఎఫ్ జీ వేరియంట్ అన్న డాక్టర్ భార్గవ
  • అప్రమత్తంగా ఉండాలే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డాక్టర్ భార్గవ
దేశంలో ఈ ఏడాది కరోనా కేసులు మళ్లీ నమోదు అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ 11 వరకు దేశంలో కొవిడ్ -19 సాధారణ కేసులు ఏడు వేలకు పైగా నమోదయ్యాయి. 74 మరణాలు సంభవించాయి. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ, ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరోసారి భయాందోళనలు కలుగుతుండగా, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ కీలక విషయం వెల్లడించారు. కొవిడ్-19 వ్యాధిని కలిగించే సార్స్ కోవ్ 2 వైరస్ సహజ పరిణామమే కొత్త ఎక్స్‌ఎఫ్‌జి వేరియంట్ అని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

దేశంలో ఇంతవరకు 206 ఎక్స్‌ఎఫ్‌జి కేసులు నమోదయ్యాయని, వీటిలో అత్యధికంగా 89 కేసులు మహారాష్ట్రలో నమోదయినట్లు ఆయన చెప్పారు. ఎక్స్‌ఎఫ్‌జీ ఇంకా తీవ్ర రూపం దాల్చలేదని తెలిపారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ద్వారా ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించవచ్చని డాక్టర్ భార్గవ పేర్కొన్నారు. 
Balaram Bhargava
COVID-19
XFG Variant
ICMR
Coronavirus Cases India
Maharashtra COVID
RT-PCR Test
COVID India
Health News

More Telugu News