Finn Allen: మేజ‌ర్ లీగ్‌ క్రికెట్ టోర్నీలో ఫిన్ అలెన్ విధ్వంసం.. 19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు!

Finn Allen Sets T20 Record with 19 Sixes in MLC
  • ఎంఎల్‌సీ 2025 ఆరంభ మ్యాచ్‌లోనే ఫిన్ అలెన్ విధ్వంసం
  • ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు
  • 51 బంతుల్లోనే 151 పరుగులు.. 34 బంతుల్లోనే సెంచరీ
  • క్రిస్ గేల్, సాహిల్ చౌహాన్ (18 సిక్సర్లు) రికార్డు బద్దలు
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2025 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రికార్డుల మోత మోగింది. న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున బ‌రిలోకి దిగిన అలెన్.. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లను ఊచకోత కోశాడు.

అమెరికాలోని ఓక్లాండ్ కొలీజియం వేదికగా ఇవాళ‌ జరిగిన ఎంఎల్‌సీ 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త న‌మోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుకు ఫిన్ అలెన్ ఆరంభం నుంచే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ కివీస్ ఆటగాడు, మైదానం నలువైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు.

కేవలం 14 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లతో 40 పరుగులు చేసి తన ఉద్దేశాన్ని స్పష్టం చేసిన అలెన్, ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌రింత జోరు పెంచిన బ్యాట‌ర్‌ కేవలం 34 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఇది ఎంఎల్‌సీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ. అలాగే ఒక న్యూజిలాండ్ బ్యాటర్ తరఫున టీ20ల్లో నమోదైన ఫాస్టెస్ట్‌ శతకం కూడా ఇదే కావడం విశేషం.

సెంచరీ సాధించిన తర్వాత కూడా అలెన్ జోరు తగ్గ‌లేదు. మరింత రెచ్చిపోయాడు. ఈ క్ర‌మంలో తన ఇన్నింగ్స్‌లో 19వ సిక్సర్‌ను బాదాడు. ఈ భారీ షాట్‌తో అంతకుముందు క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉన్న 18 సిక్సర్ల రికార్డును అలెన్ అధిగ‌మించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అలెన్ అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే ఇదే సిక్సర్‌తో కేవలం 49 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. త‌ద్వారా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాటర్‌గా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే, 20వ సిక్సర్ కోసం ప్రయత్నించి ఆ తర్వాతి ఓవర్‌లో అలెన్ పెవిలియన్ చేరాడు. అతను అవుటయ్యే సమయానికి 51 బంతుల్లో 151 పరుగులు (19 సిక్సర్లు) చేశాడు. అలెన్ వీరవిహారంతో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 269 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇది అమెరికా గడ్డపై పురుషుల టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక జట్టు స్కోరు కావడం గమనార్హం.

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక టీ20 సిక్సర్లు
19 సిక్సులు – ఫిన్ అల్లెన్ (శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్), 2025
18 సిక్సులు- క్రిస్ గేల్ (రంగ్‌పూర్ రైడర్స్ vs డైనమైట్స్), 2017
18 సిక్సులు – సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా vs సైప్రస్), 2024
Finn Allen
Major League Cricket
MLC 2025
San Francisco Unicorns
Washington Freedom
T20 cricket record
Chris Gayle
Sahil Chauhan
fastest century
highest score

More Telugu News