Air India Crash: ఘోర విమాన ప్రమాదంపై క్రికెటర్ల దిగ్భ్రాంతి

Ahmedabad Plane Crash Rohit Sharma Virat Kohli Express Grief
  • అహ్మదాబాద్‌లో నిన్న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదం
  • లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన వైనం
  • మేఘానీ నగర్ నివాస ప్రాంతంలో పడటంతో తీవ్ర నష్టం
  • క్రికెటర్లు రోహిత్‌, కోహ్లీ, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్, ర‌షీద్ ఖాన్‌, ఐపీఎల్ జట్ల సంతాపం
అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. లండన్‌లోని గ్యాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై భార‌త క్రికెట‌ర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం నిన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మొత్తం 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే, విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీ నగర్ అనే నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

ఈ విషాద ఘటనపై భార‌త క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియ‌జేస్తూ పోస్టులు పెట్టారు. 

హర్భజన్ సింగ్ స్పందిస్తూ "అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఊహించలేని బాధను, నష్టాన్ని ఎదుర్కొంటున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాదంలో ప్రభావితమైన ప్రతి ఒక్కరి పరిస్థితి పట్ల నా హృదయం ద్రవిస్తోంది" అని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నాడు. 

"అహ్మదాబాద్ నుంచి నిజంగా విచారకరమైన, కలతపెట్టే వార్త. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ, వారి కుటుంబాలకు ప్రార్థనలు" అని ప్రస్తుత భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో రాశాడు.

"ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. బాధితులందరికీ నా ప్ర‌గాఢ సానుభూతి" అని విరాట్ కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఈ దుర్ఘటనపై సంతాపం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్ట్ చేశాయి.
Air India Crash
Ahmedabad plane crash
Rohit Sharma
Virat Kohli
Harbhajan Singh
Irfan Pathan
Rashid Khan
IPL franchises
Gujarat plane accident
aviation disaster

More Telugu News