Arjun Patolia: విమాన ప్రమాదం: భార్య చివరి కోరిక తీర్చడానికి భారత్‌కు వచ్చి, తిరిగి వెళుతుండగా...!

Arjun Patolia Man dies in Ahmedabad plane crash after fulfilling wifes last wish
  • టేకాఫ్ అయిన 32 సెకన్లకే కూలిన ఎయిర్ ఇండియా విమానం
  • ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం
  • భార్య అస్థికలు నిమజ్జనం చేసి లండన్ వెళ్తున్న వ్యక్తి కూడా మృత్యువాత
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. విమానం గాల్లోకి లేచిన తర్వాత కేవలం 672 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకోగలిగిందని, ఆ తర్వాత అదుపుతప్పి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని మేఘానీ నగర్‌లోని బీజే మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్‌లోని ఒక భవనంపై కూలిపోయిందని అధికారులు తెలిపారు.

భార్య చివరి కోరిక తీర్చి వస్తూ భర్త కూడా..

ఈ ప్రమాదంలో లండన్‌లో నివసిస్తున్న అర్జున్ పటోలియా అనే వ్యక్తి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భార్య భారతి కొన్ని రోజుల క్రితం మరణించారు. తన అస్థికలను గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా వాడియా గ్రామంలో ఉన్న తమ పూర్వీకుల చెరువులో నిమజ్జనం చేయాలన్న ఆమె చివరి కోరికను తీర్చడానికి అర్జున్ భారత్‌‍కు వచ్చారు. ఈ నెల ఆరంభంలో వాడియా గ్రామంలో భారతికి సంతాప సభ కూడా నిర్వహించారు.

అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేసుకుని, లండన్‌లో ఉన్న తన ఇద్దరు కుమార్తెల వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందారు. నెల రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయి ఆ చిన్నారులు అనాథలయ్యారు.

టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు: ఎన్ చంద్రశేఖరన్

విమానం ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం జరిగిన ఈ ఘటన టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.

"ఇది చాలా క్లిష్టమైన సమయం. నిన్న జరిగిన ఘటన వర్ణించలేనిది, మేమంతా తీవ్ర దిగ్భ్రాంతిలో, దుఃఖంలో ఉన్నాము. మనకు తెలిసిన ఒక్క వ్యక్తిని కోల్పోవడమే విషాదం, కానీ ఇంతమంది ఒకేసారి మరణించడం ఊహకందనిది. ఇది టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుల్లో ఒకటి. ప్రస్తుతానికి ఏ మాటలూ ఓదార్పునివ్వలేవు, కానీ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము వారికి అండగా ఉంటాం" అని ఆయన తెలిపారు.
Arjun Patolia
Air India Flight 171
Ahmedabad plane crash
Chandrasekaran
Tata Group

More Telugu News