YS Jagan: రైతులను పరామర్శించేందుకు వెళుతుంటే రాళ్ల దాడా..?: జగన్

YS Jagan Alleges Stone Pelting Attack on Farmers Rally


రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న రైతులను పరామర్శించేందుకు వెళుతుంటే రాళ్ల దాడి చేయించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ ట్వీట్ చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని పొదిలిలో రైతులను పరామర్శించి భరోసా చెప్పేందుకే తాను అక్కడికి వెళ్లానని జగన్ తెలిపారు.

తన పర్యటనకు సంఘీభావంగా దాదాపు 40 వేల మంది రైతులు, ప్రజలు తరలి వచ్చారని జగన్ తెలిపారు. అయితే, తాము వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారితో రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. ఈ రాళ్ల దాడి వెనకున్న పన్నాగాన్ని అర్థం చేసుకున్న ప్రజలు, రైతులు అత్యంత సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. రాళ్ల దెబ్బలు తిన్న వైసీపీ కార్యకర్తలు, రైతులపైనే పోలీసు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఆ నలభై మంది టీడీపీ కార్యకర్తలపై అక్కడున్న 40 వేల మంది ప్రజలు తిరగబడి ఉంటే ఏం జరిగి ఉండేదని జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలి, అన్యాయాన్ని సరిదిద్దాలని కోరితే తానేదో విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆరోపించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
YS Jagan
Chandrababu
Andhra Pradesh
TDP
farmers protest
tobacco farmers
Podili
Prakasam district
YS Jagan Mohan Reddy
farmers issues

More Telugu News