Roja: అందుకే జగన్ అంటే నమ్మకం... బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు: రోజా

Roja Slams Chandrababu Naidu Over Talliki Vandanam Scheme
తల్లికి వందనంపై చంద్రబాబు మాట తప్పారంటూ రోజా ఫైర్
కేంద్రీయ విద్యాలయాల్లో చదివేవారిని అనర్హులను చేశారని ఆరోపణ
మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ అంటూ ట్వీట్
తల్లికి వందనం పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతోందని, తల్లులను మోసం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న తీరుకు పొంతన లేదని ఆమె విమర్శించారు.

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని, వాటి గురించి ప్రశ్నిస్తే నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రోజా ఘాటుగా స్పందించారు. "చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి విద్యార్థి తల్లికి 'తల్లికి వందనం' పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అడ్డగోలు షరతులు విధిస్తూ కొందరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ?" అంటూ రోజా నిలదీశారు.

ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే, మరోవైపు షరతులతో వాటికి కోతలు విధిస్తున్నారనేది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యంగా 'తల్లికి వందనం' పథకం విషయంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులను పూర్తిగా అనర్హులుగా చేయడం దారుణమని రోజా అన్నారు. "గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి 'అమ్మ ఒడి' పథకం ద్వారా లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు పథకాన్ని ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ (UDISE Plus) నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు" అని రోజా తెలిపారు.

పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతూ, మరోవైపు ఇలా లబ్ధిదారులను తగ్గించడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకెన్ని కోతలు విధిస్తుందోననే ఆందోళన ప్రజల్లో ఉందని రోజా వ్యాఖ్యానించారు. "అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు" అని పేర్కొన్నారు. ఈ మేరకు రోజా ట్వీట్ చేశారు.
Roja
Roja Selvamani
Chandrababu Naidu
Talliki Vandanam
Andhra Pradesh Politics
YSRCP
TDP
Jagan Mohan Reddy
Amma Vodi Scheme
AP Government Schemes

More Telugu News