Savitha: వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి సవిత

Minister Savitha Ready to Resign if YSRCP Proves Allegations
  • తల్లికి వందనంపై వైసీపీ ఆరోపణలు
  • రూ.13 వేలు ఇచ్చి మిగతా రూ.2 వేలు లోకేశ్ జేబులోకి వెళ్లాయని ఆరోపణ
  • తీవ్రంగా స్పందించిన మంత్రి సవిత
  • ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఫైర్
తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయగలరా? అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

'తల్లికి వందనం' పథకం కింద కేటాయించిన నిధులలో రూ.2 వేలు నారా లోకేశ్ జేబుల్లోకి వెళ్లాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి సవిత ఘాటుగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, కానీ ప్రజలు ఇప్పటికే వారిని పక్కనపెట్టారని, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు.

'తల్లికి వందనం'తో తల్లుల ఖాతాల్లోకి నేరుగా నిధులు

ఎన్డీయే ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.8,745 కోట్లు జమ చేశామని, దీంతో తల్లిదండ్రులు, పిల్లలు సంతోషంగా ఉన్నారని వివరించారు.

ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తుండగా, అందులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి, మిగిలిన రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "ఇంట్లో ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురుంటే రూ.65 వేలు అందజేశాం. ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడబిడ్డలకు ఈ పథకం అందడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు" అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ కూడా ఈ పథకాన్ని అమలు చేయడం గొప్ప విషయమని, ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల కృషి ఎనలేనిదని ప్రశంసించారు.

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఒకరికే పరిమితం చేసిందని మంత్రి సవిత ఆరోపించారు. "జగన్ గారు ఎన్నికల ముందు 'నా చెల్లెమ్మలు, నా ఆడపడుచులు, వారి బిడ్డలకు నేను మేనమామ' అని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక కంసమామగా మారారు. 2022-23లో కేవలం 42 లక్షల 61 వేల మందికే రూ.5,500 కోట్లు ఇచ్చారు. మేము అదనంగా దాదాపు 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం" అని సవిత వివరించారు.
Savitha
Minister Savitha
Talli ki Vandanam
Chandrababu Naidu
Nara Lokesh
Jagan Mohan Reddy
YSRCP Allegations
AP Politics
Education Scheme
Andhra Pradesh

More Telugu News