Jagan Mohan Reddy: జగన్ పర్యటనలో రాళ్ల దాడి... వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు, మరో 15 మంది అరెస్ట్

Jagan Mohan Reddy Rally Stone Pelting YSRCP MLA Bootchepalli Receives Notice
  • ఈ  నెల 11న పొదిలిలో పర్యటించిన జగన్
  • వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడినట్టు ఆరోపణలు
  • ఎమ్మెల్యే బూచేపల్లికి పోలీసుల నోటీసులు, కొనసాగుతున్న అరెస్టులు
ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా, మరో 15 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

ఈనెల 11వ తేదీన మాజీ జగన్ పొదిలి పర్యటనకు వచ్చినప్పుడు శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిందని పోలీసులు గుర్తించారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. జగన్ పర్యటన రోజున వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి బలవంతంగా తోసుకుని వచ్చారని పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహనాలు హెలీప్యాడ్‌ వరకు వచ్చాయని, పట్టణంలో శాంతియుతంగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించి చెప్పులు, రాళ్లు విసిరారని నోటీసులో పేర్కొన్నట్టు వివరించారు. ఈ దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారని, వారి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. పొగాకు బోర్డు కార్యాలయంలోకి కూడా కార్యకర్తలు చొరబడి బేళ్లను తొక్కి ఆస్తినష్టం చేశారని ఆరోపించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహించాల్సిన స్థాయిలో ఉన్నందున, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను నోటీసు ద్వారా కోరినట్లు సీఐ వివరించారు.

అరెస్టుల పర్వం

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, శనివారం మరో 15 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 24కు చేరింది. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 


Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh
Podili
YSRCP
Boochepalli Shiva Prasad Reddy
police investigation
political violence
arrests
law and order

More Telugu News