Vangalapudi Anitha: దీన్ని బట్టి కొమ్మినేని వ్యాఖ్యలను సుప్రీం కూడా తప్పుబట్టింది!: హోంమంత్రి అనిత

Vangalapudi Anitha Fires at YSRCP Women Leaders
  • వైసీపీ మహిళా నేతల తీరుపై హోంమంత్రి అనిత తీవ్ర అసంతృప్తి
  • కొమ్మినేని వ్యాఖ్యలపై జగన్ మౌనం, మహిళల పట్ల చులకన భావానికి నిదర్శనమన్న అనిత
  • శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు, క్రైమ్ రేట్ తగ్గిందని స్పష్టం
వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ మహిళా నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంటే, దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు.

అమరావతిని "వేశ్యల రాజధాని" అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని మంత్రి అనిత అన్నారు. "అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇల్లు కట్టుకోలేదా? మాజీ మంత్రులు, ఎంపీలు, వారి కుటుంబాలు నివసించడం లేదా?" అని ఆమె ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే, దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాస్‌కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో టీవీ డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టంగా ఉందని, దీన్నిబట్టి ఆయన వ్యాఖ్యలు తప్పని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని అనిత గుర్తుచేశారు.

గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును, అంకబాబునుి, ఒక వృద్ధురాలిని అర్ధరాత్రి అరెస్టు చేయించిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. "తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్లుంది వైసీపీ నేతల తీరు" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దిశ యాప్ గురించి మాట్లాడుతూ, కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గొప్పలు చెప్పారని, కానీ వాస్తవానికి 30 లక్షల మంది కూడా లేరని, అబ్బాయిల చేత కూడా బలవంతంగా డౌన్‌లోడ్ చేయించిన సందర్భాలున్నాయని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన శక్తి యాప్‌కు కోటి 50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే మహిళలకు కూడా ట్రావెలింగ్ అసిస్టెన్స్ అందిస్తున్నామని తెలిపారు.

శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి స్పష్టం చేశారు. కడపలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడు భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఉదహరించారు. తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడే పరిస్థితిని తాము కల్పిస్తున్నామని అన్నారు. 

పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడటానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పేటీఏం బ్యాచ్‌ను వెంటేసుకుని వెళ్లి పోలీసులపై రాళ్లు రువ్వించారని ఆరోపించారు. తెనాలిలో రౌడీ షీటర్‌ను పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, చివరికి మహిళలు దాచుకున్న స్త్రీనిధి రూ.2000 కోట్లను కూడా డైవర్ట్ చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. "15వ ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేశారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. డైవర్షన్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు" అని అన్నారు. 'తల్లికి వందనం' పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.13,000 చొప్పున, రూ.2,000 స్కూల్ మెయింటెనెన్స్‌కు కేటాయిస్తుంటే, దానిపై కూడా బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని, ఇప్పుడు తాము డీఎస్సీ నిర్వహిస్తుంటే దాన్ని ఆపడానికి కోర్టులకు వెళ్లారని విమర్శించారు. "నేను కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటించిన డీఎస్సీలోనే టీచర్‌గా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు ఆయన మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నాను. ఇది చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం" అని అనిత పేర్కొన్నారు.

పోదిలి ఘటనపై మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ముస్లిం మహిళలపై వైసీపీ గూండాలు దాడులు చేశారని, దీని వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. మహిళలను అగౌరవపరిచేలా ఎవరు మాట్లాడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Vangalapudi Anitha
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
YSRCP
TDP
Chandrababu Naidu
Women Safety
Amaravati
Crime Rate
AP Home Minister

More Telugu News