Sirivennela Sitarama Sastry: ఆయనను చెన్నైకి 'కిడ్నాప్' చేసి పాటలు రాయించుకునేవాళ్లం: మణిరత్నం

Mani Ratnam Recalls Kidnapping Sirivennela For Songwriting Sessions
  • సిరివెన్నెలతో అనుబంధాన్ని పంచుకున్న మణిరత్నం
  • తక్కువ టైంలోనే పాటలు రాసిచ్చేవారన్న దర్శకుడు
  • పాటల కోసం సిరివెన్నెలను చెన్నైకి కిడ్నాప్ చేసేవాళ్లమంటూ సరదా వ్యాఖ్య
  • కవిత్వానికి, సినిమా సాహిత్యానికి సిరివెన్నెల వారధి అన్నారు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, దివంగత సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో తన మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. 'ఆయన్ను కిడ్నాప్ చేసేవాళ్లం' అంటూ సిరివెన్నెల పాటల సృష్టి వెనుక ఉన్న సరదా సన్నివేశాలను పంచుకున్నారు. 

ఓ టెలివిజన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సిరివెన్నెల గారు చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన పాటలు అందించేవారని, అందుకోసం తాము ఆయన్ను చెన్నైకి 'కిడ్నాప్' చేసి, సంగీతం తప్ప మరో ప్రపంచం తెలియని ఓ ఇంట్లో ఉంచేవాళ్లమని మణిరత్నం నవ్వుతూ చెప్పారు. అంతకుముందు వేటూరి సుందరరామ్మూర్తి గారు తన చిత్రాలకు పనిచేసేవారని, ఆయన తర్వాత ఆ స్థానాన్ని సిరివెన్నెల భర్తీ చేశారని తెలిపారు. ‘ప్రేమతో’ సినిమాతో తమ ప్రయాణం మొదలైందని... వేటూరి, సిరివెన్నెల ఇద్దరితోనూ అంతే ఆత్మీయంగా, సౌకర్యంగా ఉండేదని అన్నారు.

కేవలం పాటల సందర్భమే కాకుండా, పాత్రల స్వభావాలను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని సిరివెన్నెల సాహిత్యం అందించేవారని మణిరత్నం కొనియాడారు. అందుకే తాను పూర్తి కథ చెప్పేవాడినని, అప్పుడు పాట కథలో అంతర్భాగంగా మారేదని అన్నారు. "సాధారణంగా నా సినిమాలోని అన్ని పాటలు ఒకే రచయితతో రాయించుకుంటాను. సిరివెన్నెల కథతో పాటు ప్రతి సంభాషణ గుర్తుపెట్టుకునేవారు. రాయడంలోనే ఆయనకు ఆనందం. ఆయనతో ఉంటే సొంత అన్నయ్యతో ఉన్నట్టే అనిపించేది" అని వివరించారు.

తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కు పాటలతో పాటు మాటలు కూడా సిరివెన్నెలనే రాయాల్సిందిగా కోరానని, అందుకు ఆయన అంగీకరించారని మణిరత్నం తెలిపారు. అది పీరియాడికల్‌ సినిమా కావడంతో, ఆ కాలపు భాషపై పరిశోధన చేసి వస్తానని చెప్పారని గుర్తుచేసుకున్నారు. "ట్యూన్స్ సిద్ధమయ్యాయని ఫోన్ చేశాను, కొన్ని వారాలు సమయం కావాలన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఆయన లేని లోటు నన్ను తీవ్రంగా బాధిస్తోంది," అంటూ మణిరత్నం భావోద్వేగానికి లోనయ్యారు. కవిత్వానికి, సినిమా సాహిత్యానికి సిరివెన్నెల ఒక వారధిలా నిలిచారని, పాటల స్థాయిని పెంచిన గొప్ప కవి అని ప్రశంసించారు.
Sirivennela Sitarama Sastry
Mani Ratnam
Sirivennela
Ponniyin Selvan
Telugu Songs
Lyricist
Tollywood
Vetri Sundararama Murthy
Prema Tho Movie

More Telugu News