Benjamin Netanyahu: ఇరాన్ ట్రంప్‌ను చంపాలని చూస్తోంది.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!

Benjamin Netanyahu Claims Iran Plotting to Kill Trump
  • ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంద‌న్న‌ నెతన్యాహు
  • ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా ట్రంప్‌కు జూనియర్ పార్ట్‌నర్‌నన్న ఇజ్రాయెల్ ప్రధాని
  • గతంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్?
  • ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను అడ్డుకున్న ట్రంప్ అని కథనాలు
  • ఇజ్రాయెల్-ఇరాన్ దాడుల మధ్య రద్దయిన అమెరికా-ఇరాన్ అణు చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ విషయంలో నెతన్యాహు మొదటినుంచీ కఠిన వైఖరి అవలంబిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు చేయడం మ‌రింత‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

నెతన్యాహు ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇరాన్ డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలనుకుంటోంది  అని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించే ప్రయత్నాల్లో తాను ట్రంప్‌కు జూనియర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించానని ఈ సంద‌ర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో నెతన్యాహు ఈ ఆరోపణలు చేశారు.

పలు నివేదికల ప్రకారం 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ దేశ కీల‌క‌ నేత అయతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదిత ఆపరేషన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని సమాచారం. "ఇరాన్ ఇంకా ఏ అమెరికన్‌ను చంపలేదు కదా? అమెరికన్లపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడితేనే అలాంటి తీవ్ర చర్యల గురించి ఆలోచించాలి" అని ట్రంప్ స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే, ట్రంప్‌తో జరిగిన సంభాషణల గురించి నిర్దిష్ట వివరాలను ధ్రువీకరించడానికి లేదా ఖండించడానికి నెతన్యాహు నిరాకరించారు. "జరగని సంభాషణల గురించి చాలా తప్పుడు వార్తలు వస్తుంటాయి. వాటిలోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. మా దేశ రక్షణకు ఏది అవసరమో అది మేము చేస్తాం" అని ఆయన అన్నారు.

ఇక‌, నెతన్యాహు చేసిన తాజా ఆరోపణలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని, ఈ వివాదం వ్యక్తిగత స్థాయికి చేరిన తీరును స్పష్టం చేస్తున్నాయి. మాజీ, ప్రస్తుత నాయకులు ఇప్పుడు మాటల యుద్ధానికే కాకుండా, బహుశా ప్రత్యక్ష దాడులకు కూడా లక్ష్యంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
Benjamin Netanyahu
Donald Trump
Iran
Israel
Netanyahu Trump
Iran nuclear program
Operation Rising Lion
Ayatollah Ali Khamenei
Middle East conflict
Israel Iran relations

More Telugu News