Ahmedabad Plane Crash: ప్రయాణికుల ఫోన్ నంబర్లే ఎమర్జెన్సీ కాంటాక్టులు!

Ahmedabad Plane Crash Passengers Used Own Numbers as Emergency Contacts
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అధికారులకు చిక్కులు
  • దాదాపు 70 శాతం మంది ప్రయాణికులు తమ నెంబరే ఇచ్చారంటున్న అధికారులు
  • ప్రయాణికుల బంధువులకు సమాచారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగిందని వెల్లడి 
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించడంలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సిన చోట ప్రయాణికుల్లో చాలామంది తమ సొంత నెంబరే పేర్కొన్నారని వెల్లడించారు. దీంతో ప్రమాద సమాచారాన్ని ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులకు చేరవేయడంలో ఆలస్యం జరిగిందన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషాద వార్తను ప్రయాణికుల ఆత్మీయులకు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ విషయంలో ప్రయాణికులు నిర్లక్ష్యం వహించడంతో అధికారులకు ఊహించని సవాలు ఎదురైంది. ప్రయాణికులలో 70 శాతం మంది తమ సొంత నెంబర్లనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లుగా పేర్కొనడంతో తాము ఫోన్ చేసినపుడు స్విచ్ ఆఫ్ వచ్చాయని అహ్మదాబాద్ విమానాశ్రయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రమాదంలో ఫోన్లు ధ్వంసం కావడంతో, వారి కుటుంబ సభ్యులను తక్షణమే సంప్రదించడం కష్టంగా మారిందని వివరించారు. చాలా కుటుంబాలు ప్రమాద వార్త తెలుసుకుని స్వయంగా ముందుకు రాగా, మిగిలిన వారిని గుర్తించడానికి స్థానిక యంత్రాంగం సహాయం తీసుకున్నామని సదరు అధికారి పేర్కొన్నారు. కలెక్టర్ల ద్వారా ప్రయాణికులు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి వారి బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా, డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఇప్పటివరకు 80 మంది మృతదేహాలను గుర్తించామని, అందులో 33 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Ahmedabad Plane Crash
Gujarat Plane Accident
Emergency Contact Information
Passenger Information Delay
DNA Matching Identification
Flight Booking Information
Ahmedabad Airport Authority
Plane Crash Victims
Family Notification Delay

More Telugu News