Adluri Laxman: బడుగులకే మా ప్రభుత్వంలో పెద్దపీట: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Telangana Minister Adluri Laxman on Congress Welfare Schemes
  • రాహుల్ జోడో యాత్ర దేశ రాజకీయాలను మార్చిందన్న లక్ష్మణ్
  • 18 నెలల్లోనే సంక్షేమంలో తెలంగాణ దూకుడు ప్రదర్శించిందని వ్యాఖ్య
  • రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న మంత్రి
కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో సామాజిక న్యాయం సాకారమవుతుందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఈ ఉదయం దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా తన ఇలవేల్పు, కులదైవమైన వేములవాడ రాజన్న, అమ్మవార్ల దర్శనం చేసుకున్నాకే మొదలుపెడతానని తెలిపారు.

1984లో ఎన్ఎస్యూఐతో మొదలైన తన రాజకీయ ప్రస్థానం నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోందని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిందని, ఈ యాత్ర సామాజిక న్యాయానికి బలమైన పునాది వేసిందని ప్రశంసించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ప్రమాదం పొంచి ఉందని తెలిసినా రాహుల్ గాంధీ యాత్రను కొనసాగించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మార్గనిర్దేశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెడుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీలు చెల్లిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తోందని అన్నారు. అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 59 వేల ఉద్యోగాల కల్పన వంటివి పూర్తి చేశామని, ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ప్రజల సంక్షేమానికి పాటుపడిన రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి చిరునామా అని, రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆగస్టు 1న అసెంబ్లీలో చట్టం చేశామని మంత్రి గుర్తుచేశారు. ఈ చట్టం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనతో పాటు గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి వంటి బడుగు, బలహీన వర్గాలకు చెందినవారికి మంత్రులుగా, డిప్యూటీ స్పీకర్‌గా ఒకేరోజు అవకాశం దక్కడం స్వామివారి ఆశీస్సులతోనే సాధ్యమైందని, ఇది జీవితంలో ఊహించని అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ధర్మపురి ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ అగ్రనేతల అండ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో తనకు అప్పగించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఆయా శాఖల్లోని సమస్యలను పరిష్కరించి, ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 
Adluri Laxman
Telangana
Congress Party
Revanth Reddy
Social Justice
SC ST Welfare
Rahul Gandhi
Bharat Jodo Yatra
Vemulawada
Telangana Politics

More Telugu News