Vijay Rupani: విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీకి నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Ex CM Vijay Rupani state funeral today
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
  • డీఎన్ఏ పరీక్షతో మృతదేహం గుర్తింపు
  • అంత్యక్రియలకు హాజరుకానున్న అమిత్ షా తదితర ప్రముఖులు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. 

లండన్‌లో ఉంటున్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు వెళ్తుండగా విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. అంతకుముందు రెండుసార్లు... మే 19న, జూన్ 5న ఆయన లండన్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మూడో ప్రయత్నంగా జూన్ 12న బయలుదేరిన ఆయనకు అదే చివరి ప్రయాణమైంది. జూన్ 25న తిరిగి రావాలని ఆయన ప్రణాళిక చేసుకున్నారు. విమానం ఎక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో రూపానీ ఎంతో ఉత్సాహంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు తీసిన వీడియోలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

జూన్ 12వ తేదీన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ విమానం సమీపంలోని ఓ మెడికో హాస్టల్‌పై పడటంతో పెను విషాదం చోటుచేసుకుంది. విమానంలో సుదూర ప్రయాణానికి సరిపడా సుమారు 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో, కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.

ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో ఒకే ఒక ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, విజయ్ రూపానీతో సహా 241 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా, విమానం కూలిన ప్రదేశంలోని మెడికో హాస్టల్‌లో కూడా భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 35 మంది వైద్య విద్యార్థులు మరణించగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ రూపానీ అంత్యక్రియలను ఈరోజు రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది. ఈ అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరుకానున్నారు.
Vijay Rupani
Gujarat Ex CM
Ahmedabad Plane Crash
Air India Boeing 787
Plane Accident
Medical College Hostel Fire
Amit Shah
Rajkot Funeral
Gujarat Mourning
India Aviation Disaster

More Telugu News