Venkatapathy Raju: స‌చిన్‌తో పోల్చొద్దు.. వైభవ్ నిరూపించుకోవాల్సింది చాలా ఉంది: వెంకటపతి రాజు

Venkatapathy Raju on Vaibhav Suryavanshi Sachin Tendulkar comparisons
  • ముందు దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకోవాలని వైభవ్‌కు సూచన
  • సచిన్ టెండూల్కర్‌తో పోలికలు ఇప్పుడే సరికాదన్న మాజీ స్పిన్నర్
  • అండర్-19, రంజీ ట్రోఫీ వంటి టోర్నీలపై దృష్టి పెట్టాలని హితవు
  • సచిన్ కూడా దేశవాళీలో రాణించాకే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడని గుర్తుచేసిన రాజు
ఐపీఎల్ 2025లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన 14 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ గురించి భారత మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంత చిన్న వయసులోనే సంచలన ప్రదర్శనలు చేయడంతో వైభవ్‌ను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజు స్పందిస్తూ ఆ పోలికలు ఇప్పుడే తొందరపాటు అవుతాయని అభిప్రాయపడ్డాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే వైభవ్ ముందుగా దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటాలని ఆయన సూచించాడు.

హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. వైభవ్ ప్రతిభను వెంకటపతి రాజు  కొనియాడాడు. అయితే, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఇంకా చాలా సమయం ఉంద‌న్నాడు. తొలుత అండర్-19 ప్రపంచకప్‌లు, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి నాలుగు రోజుల మ్యాచ్‌లలో నిలకడగా రాణించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు. 

"అవును, అతనికి చాలా సమయం పడుతుంది. అండర్-19 ప్రపంచకప్‌లలో బాగా ఆడాల్సిన వారిలో అతను ఒకడు కావాలి. దేశవాళీ క్రికెట్‌లో అతను చాలా ప్రదర్శన చేయాలి. ప్రతిభ పరంగా అతను వైట్ బాల్‌తో ఏమి చేయగలడో మనం ఇప్పటికే చూశాం కదా" అని రాజు పేర్కొన్నాడు.

సచిన్ టెండూల్కర్‌తో వైభవ్‌ను పోల్చడంపై రాజు స్పందిస్తూ.. "ఇది నిలకడ మీద ఆధారపడి ఉంటుంది. మనం సచిన్ లాంటి వారి గురించి మాట్లాడవచ్చు. తొలి రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అతను 100 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీలో 100 చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 100 చేశాడు. అన్నీ మూడు రోజుల మ్యాచ్‌లు, నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఐదు రోజుల మ్యాచ్‌లు. ఆ విధంగా ప్రతిభ ఉందని తెలిసినప్పుడు, మనం అతనికి వెళ్లి ఆడి, బాగా రాణించడానికి తగినంత సమయం ఇవ్వాలి. అతను నిజంగా సమర్థుడని, ప్రదర్శన చేయగలడని మీరు భావిస్తే, ఎందుకు కాదు? మనం అతన్ని జట్టులోకి తీసుకురావచ్చు" అని వివరించాడు. 

సచిన్ కూడా భారత జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడని, వైభవ్ కూడా అదే బాటలో నడిచి నిలకడగా రాణించగలనని నిరూపించుకోవాలని రాజు సలహా ఇచ్చాడు.
Venkatapathy Raju
Vaibhav Suryavanshi
Sachin Tendulkar
IPL 2025
Under 19 World Cup
Ranji Trophy
Duleep Trophy
Domestic Cricket
Indian Cricket

More Telugu News