GHMC: హైకోర్టు అక్షింతలతో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

GHMC Acts on Illegal Constructions After High Court Scrutiny
  • అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని సర్క్యులర్ జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
  • అక్రమ నిర్మాణాల్లో ఎవరైనా ఉంటే మూడు రోజుల్లో ఖాళీ చేయాలని సూచించాలన్న కమిషనర్
  • భవనంలోని ప్రవేశ, బయటకు వెళ్లే దారులను ఎర్రటి రంగు రిబ్బన్‌తో మూసివేయాలని ఆదేశం
నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఇకపై అక్రమ నిర్మాణాలు, అనుమతి తీసుకున్న ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ప్రామాణిక విధి విధానాలు విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్ 461 – ఏ, టీజీ – బీపాస్ నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాల ప్రకారం భవనాలు సీజ్ చేసే అవకాశం ఉందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అక్రమ/తీసుకున్న అనుమతిని ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో ఇప్పటి వరకు ఎవరైనా ఉంటే మూడు రోజుల్లో ఖాళీ చేయాలని సూచించాలని తెలిపారు. భవనంలోని ప్రవేశ, బయటకు వెళ్లే దారులు, మెట్లు, లిఫ్టులు, ర్యాంపులను ఎర్రటి రంగు రిబ్బన్‌తో మూసివేయాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల వైఖరిపై నిన్న హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని, ఆ సమయంలో కళ్లు మూసుకుని వ్యవహరిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ భవన నిర్మాణదారుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రాంతాల వారీగా పర్యవేక్షణకు అధికారులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు ఎలా సాధ్యమవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయానికి వచ్చారు. 
GHMC
Hyderabad High Court
illegal constructions
building violations
town planning
unauthorized structures
RV Karnan
Telangana
TG BPASS
court orders

More Telugu News