Ahmedabad Air India Crash: అహ్మదాబాద్ దుర్ఘటన: ప్రాణాలతో బయటపడేందుకు విద్యార్థుల ఆరాటం.. వెలుగులోకి మరో వీడియో

Ahmedabad Air India Crash Students Struggle to Escape New Video
  • గుజరాత్‌లో గత వారం ఎయిరిండియా విమాన ప్రమాదం
  • మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానం
  • ప్రాణభయంతో బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు
  • సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన వీడియో
గుజరాత్‌లో గత వారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో దిగ్భ్రాంతికరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని విద్యార్థులు ప్రాణభయంతో బాల్కనీల నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారిని తీవ్రంగా కలచివేస్తోంది.

జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, భవనంలో మంటలు వ్యాపిస్తుండగా, కొందరు విద్యార్థులు రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీల నుంచి బెడ్‌షీట్లు, తాళ్ల సహాయంతో కిందికి దిగుతూ, మరికొందరు నేరుగా దూకుతూ కనిపించారు. భవనానికి ఒకవైపు మంటలు ఎగిసిపడుతుండగా, మరోవైపు నుంచి విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.

ఈ దుర్ఘటన జరిగిన సమయంలో హాస్టల్‌లోని చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. విమానం భవనంపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 241 మంది అక్కడికక్కడే మరణించారు. వీరితో పాటు, విమానం కూలిన హాస్టల్ భవనంలోని పలువురు వైద్య విద్యార్థులు, సిబ్బందితో కలిపి మరో 33 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
Ahmedabad Air India Crash
Air India Flight 1974
BJ Medical College Hostel
Gujarat Plane Crash

More Telugu News