Kanna Lakshminarayana: జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana Slams Jagans Sattenapalli Visit
  • జగన్‌ను నమ్మితే మిగిలేది సర్వనాశనమేనన్న కన్నా 
  • ఆత్మహత్య చేసుకున్న నేత విగ్రహానికి జగన్ ఆవిష్కరణా? సిగ్గుచేటు అంటూ ఫైర్
  • జగన్ పర్యటనకు ఒక్కరోజు ముందు టీడీపీలో చేరిన సత్తెనపల్లి కౌన్సిలర్లు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వస్తున్నారు. గతేడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, జగన్ పర్యటనపై సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. 

జగన్ ను నమ్మి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది సర్వనాశనమయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీకి చెందిన నలుగురు వైసీపీ కౌన్సిలర్లు నేడు టీడీపీలో చేరారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు కేవలం ఒక రోజు ముందు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టుల కారణంగానే నాగమల్లేశ్వరరావు ఎన్నికల బెట్టింగ్‌లో ఏకంగా రూ.10 కోట్లు నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర అవమానాలు ఎదురవడంతో, తట్టుకోలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇప్పుడు జగన్ రావడం సిగ్గుచేటు" అని కన్నా మండిపడ్డారు.

జగన్ అరాచకాలను ప్రజలు భరించలేకపోయారని, అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని కన్నా గుర్తుచేశారు. "ఇలాంటి అరాచక శక్తులను పరామర్శించడానికి వస్తే, ఈసారి ఆ పార్టీకి 11 సీట్లు కూడా దక్కవు" అని ఆయన హెచ్చరించారు.
Kanna Lakshminarayana
Jagan Mohan Reddy
Sattenapalli
Andhra Pradesh Politics
TDP
YCP
Nagamalleswara Rao
Political Criticism
2024 Elections
Suicide

More Telugu News